కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలోగల అక్కాయపల్లెలో ఈనెల 11వ తేదీ రాత్రి నుంచి సోమవారం ఉదయం లోపు గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంటిలో చోరీకి పాల్పడినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జెడ్పీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గంగవరం సురేష్ తన భార్యతో కలిసి ఆదివారం చర్చికి వెళ్లాడు. అక్కడి నుంచి ప్రొద్దుటూరుకు తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి సోమవారం ఉదయం ఇంటికి వచ్చాడు. ఆ సమయానికే తాళాలు, గడియ పగులగొట్టి బీరువాలోని రెండున్నర తులం బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా ఎస్‌ఐ రాజరాజేశ్వరరెడ్డి తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి
కడప తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో దొంగతనాల బారిన పడకుండా ప్రతి ఇంటికి స్టిక్కర్లను గతంలో అతికించామని ఎస్‌ఐ తెలిపారు. ఎక్కడికైనా ఊరికి వెళితే తిరిగి సాయంత్రానికి రాలేని వారు కచ్చితంగా 08562–242132, 94407 96907 నెంబర్లకు ఫోన్ చేసి తెలపాలన్నారు. తాము పోలీసుల నిఘాను ఏర్పాటు చేస్తామన్నారు.