బంగారు దుకాణాల నుంచి స్వాదీనం చేసుకున్న వస్తువులను తరలిస్తున్న ఐటీశాఖ సిబ్బంది
ప్రొద్దుటూరు క్రైం: బంగారం వ్యాపారానికి ప్రసిద్ధి గాంచిన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఐటీ అధికారులు సోదాలు జరిపి సుమారు 300 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. బంగారు నగలతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని రెండు వాహనాల్లో తిరుపతికి తరలించారు. ప్రొద్దుటూరులోని నాలుగు బంగారం దుకాణాల్లో ఈ నెల 19 నుంచి ఆదాయపన్నుశాఖ అధికారులు జరిపిన తనిఖీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి.
అధికారులు బంగారం దుకాణాలతో పాటు యజమానులు, వారి బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఒక దుకాణంలో సుమారు 200 కిలోలు, మరో రెండు దుకాణాల్లో 100 కిలోల వరకు లెక్కలు చూపని బంగారం లభించడంతో దాన్ని సీజ్ చేశారు. కాగా ఐటీ అధికారులు ఈ వివరాలను అధికారికంగా ధ్రువీకరించలేదు.
పండుగ సమయంలో స్తంభించిన వ్యాపారం
కొనుగోలుదారులకు బిల్లులు ఇవ్వకుండా బంగారు నగలు విక్రయించడంతో పాటు అక్రమంగా బంగారం దిగుమతి చేసుకుంటున్నారని ఫిర్యాదులు వెల్లటంతో ప్రొద్దుటూరులోని నాలుగు బంగారం దుకాణాల్లో ఈ నెల 19న సుమారు 40 మంది ఇన్‌కం ట్యాక్స్ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పెద్దమొత్తంలో లెక్కలు లేని బంగారం లభించడంతో పట్టణంలోని బంగారం దుకాణాల్లో జీరో వ్యాపారం జరుగుతోందన్న విషయం బయటపడిందని అధికారులు చెబుతున్నారు.
గతంలో ఎన్నడూ ఇలా సుదీర్ఘంగా సోదాలు జరగలేదని వ్యాపారులు పేర్కొన్నారు. వేలాది బంగారం దుకాణాలున్న ప్రొద్దుటూరులో ఐటీ అధికారుల దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా వ్యాపారాలు స్తంభించిపోయాయి. తనిఖీలు తమవరకు ఎక్కడ వస్తాయో అనే భయంతో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. పండుగ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలు దుకాణాలు మూసివేయడంతో నిరాశ చెందారు.
Comments
Please login to add a commentAdd a comment