అనంతపురం సెంట్రల్: ప్రభుత్వ ఉద్యోగులనే టార్గెట్‌గా చేసుకొని నగరంలో దొంగలు విజృంభిస్తున్నారు. వారం రోజుల క్రితం ఉద్యానశాఖ ఏడీ వెంకటరమణ ఇంట్లో జరిగిన దొంగతనం మరువకముందే వ్యవసాయశాఖ అనుబంధ ‘ఆత్మ’ విభాగం పీడీగా పనిచేస్తున్న డాక్టర్ పెరుమాళ్ల నాగన్న ఇంట్లో దొంగలు పడ్డారు. బాధితుడు తెలిపిన మేరకు... నగరంలో హౌసింగ్‌బోర్డులో ‘ఆత్మ’ పీడీ నాగన్న నివాసముంటున్నారు. కుటుంబం మొత్తం కర్నూలులో స్థిరపడగా ఆయనొక్కరే ఇక్కడ ఉంటున్నారు. కుమారులు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. గురువారం విజయవాడలో రాష్ట్రస్థాయి వర్క్‌షాపు ఉండడంతో 13వ తేదీన వెళ్లారు.
ఇంటికి తాళం వేసిన విషయాన్ని పసిగట్టిన దొంగలు గురువారం రాత్రి చొరబడ్డారు. శబ్దం వస్తే పక్కింటి వారు వస్తారేమోనని వారి ఇంటికి బయట గడియపెట్టారు. మొత్తం మూడు తలుపుల తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అలమారలోని 14 తులాల బంగారు, రూ. 30 వేలు నగదు, 1.5 కిలోల వెండి, నాలుగు పట్టుచీరలు చోరీ చేశారు. శుక్రవారం ఉదయాన్నే పక్కింటి వారు పీడీ నాగన్నకు సమాచారం అందించారు. టూటౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
‘ఆత్మ’ పీడీ ఇంట్లో చోరీ
Published Fri, Sep 15 2017 10:28 PM | Last Updated on Tue, Sep 19 2017 4:36 PM
Advertisement