ఎక్కడి పనులు అక్కడే..!
కృష్ణా పుష్కరాలకు ముంచుకొస్తున్న గడువు
–చందంపేట, పెద్దవూర మండలాల్లో పనులు నత్తనడక..
–ఆలస్యంగా ఇచ్చారని కాంట్రాక్టర్ల ఆవేదన
కృష్ణా పుష్కరాలకు గడువు ముంచుకొస్తున్నా పనుల్లో వేగం పుంజుకోవడం లేదు. ఇప్పటికే చివరి దశకు చేరుకోవాల్సిన పనులు.. నత్తనడకను తలపిస్తున్నాయి. పలు చోట్ల పరిస్థితి చూస్తుంటే సకాలంలో పూర్తవుతాయా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్క్స్ ఆలస్యంగా ఇవ్వడం వల్లే జాప్యం జరుగుతుందని కాంట్రాక్టర్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
చందంపేట : మండలంలో కృష్ణా పుష్కరాల కోసం పెద్దమునిగల్, కాచరాజుపల్లిలో రెండు ఘాట్లు నిర్మిస్తున్నారు. ఈనెలాఖరు నాటికి వాటి నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. అధికారులు, కాంట్రాక్టర్లు ఎల్లవేళలా పనుల్లో నిమగ్నమైనా గడువులోగా పూర్తయ్యేలా కనిపించడం లేదు. అదే విధంగా ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో పెద్దమునిగల్ స్టేజీ నుంచి కాచరాజుపల్లి డబుల్ రోడ్డు వరకు 31 కిలో మీటర్ల మే రూ. 34.7 కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నారు. ఈ పనుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. సింగిల్ రోడ్డు కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పెద్దమునిగల్ ఘాట్‌కు చేపట్టిన రోడ్డు పనులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంతో ఇప్పటికీ పూర్తి కాలేదు. పార్కింగ్ కోసం పెద్దమునిగల్, కాచరాజపల్లి వద్ద స్థలం సేకరించారు. కానీ ఆ స్థలాల నిండా చెట్టే దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉండగా పుష్కరాల సమయం నాటికి నీరు రాకుంటే నది నుంచిlమోటార్లు ఏర్పాటు చేసి ఘాట్‌ల వద్దకు పైపుల ద్వారా సరఫరా చేయాలి. భక్తులు స్నానం చేయడానికి షవర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఏర్పాట్లు మొదలే పెట్టలేదు. మంచినీటి సౌకర్యం కోసం రెండు ఘాట్ల వద్ద నిర్మిస్తున్న ఆర్వో ప్లాంట్ల పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా పార్కింగ్ స్థలాలు, ఘాట్ల వద్ద విద్యుదీకరణ పనులు ఇంకా చివరి దశకు చేరుకోలేదు. పెద్దమునిగల్ ముత్యాలమ్మ దేవాలయం, కాచరాజుపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి రెండు రోజుల క్రితమే మరమ్మతు పనులు ప్రారంభించారు.
తలలు పట్టుకుంటున్న అధికారులు
పుష్కరాలకు గడువు ముంచుకొస్తుండడం, పనులు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో అధికారులు, కాంట్రాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. పనుల కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించిందని, సకాలంలో పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తుండడంతో కాంట్రాక్టర్లు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. పనులు ముందుగా అప్పగిస్తే గడువులోగా పూర్తి చేసేవాళ్లమని, ఆలస్యంగా ఇచ్చి పూర్తి చేయాలంటే ఎలా సాధ్యమని కొంతమంది కాంట్రాక్టర్లు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు.