అసెంబ్లీలో భూ ఆక్రమణలవేడి
►తిరుపతి రూరల్ భూ ఆక్రమణల లెక్కలు తీయండి
►ఆక్రమణలు ఎంత, వాటి విలువ ఎంత, వాటిపై చర్యలేంటి?
►ఏపీ అసెంబ్లీలో మంత్రిని నిలదీసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
►కలెక్టర్ తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపణ
►ఆధారాలతో సహా సభ ముందుంచిన ఎమ్మెల్యే
►సమాధానం చెప్పలేక ఇబ్బందిపడ్డ మంత్రి
►తప్పుడు నివేదిక, ఆక్రమణలపై చర్యలు తీసుకుంటాం: మంత్రి
తిరుపతి: తిరుపతి రూరల్ మండలంలో జరిగిన ప్రభుత్వ భూ ఆక్రమణల వ్యవహారం బుధవారం అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చారని ఎమ్మెల్యే భాస్కర్‌రెడ్డి «సభలోనే ధ్వజమెత్తడం జిల్లా రెవెన్యూ వర్గాల్లో ఆసక్తి, ఆందోళన రేపుతోంది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. తిరుపతి రూరల్ మండలంలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల విస్తీర్ణమెంత, ఎక్కడెక్కడ ఆక్రమణలో ఉంది, ఎవరెవరు, ఎంతెంత ఆక్రమించుకున్నారు, వాటి విలువ ఎంత, ఆక్రమణలపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలేంటి, ఇకపై తీసుకుబోయే చర్యలేంటి అంటూ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తిని ఆయన నిలదీశారు.
దీనిపై మంత్రి సమాధాన మిస్తూ 296.28 ఎకరాల భూమి ఆక్రమణలో ఉందని, వాటి విలువ 165.80 కోట్లు అని తెలిపారు. గత రెండేళ్లుగా రెవెన్యూ విభాగం ఆక్రమణలు తొలగించడానికి చర్యలు తీసుకుంటోందని, మిగతా భూ ఆక్రమణలు తొలగించకపోతే సంబంధిత రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. దీనిపై చెవిరెడ్డి స్పందిస్తూ చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ ఇచ్చిన నివేదిక తప్పు అని తెలిపారు. ఒక తప్పుడు నివేదికను ఒక సీనియర్ మంత్రికి ఇచ్చి చదివించారని, ఇది కలెక్టర్ బాధ్యతారాహిత్యమని స్పష్టం చేశారు. 11.03.2017న తిరుపతి రూరల్ తహశీల్దార్ నివేదిక పంపుతూ 938 ఎకరాలు ఆక్రమణకు గురైందని పేర్కొన్నారని, దాని విలువ అంచనా వేయలేమని కలెక్టర్‌కు తహశీల్దార్ పంపిన నివేదికను స్పీకర్ ద్వారా మంత్రికి అందజేశారు.
ఒకపక్క తహశీల్దార్ ఆక్రమిత భూముల విలువ చెప్పలేమని చెబితే, కలెక్టర్ మాత్రం రూ.165 కోట్లు అని ఏ విధంగా నివేదికలో పేర్కొన్నారని ప్రశ్నించారు. వీటితోపాటు 20 సంవత్సరాలకు ముందు ఆక్రమణకు గురైందని కలెక్టర్ మంత్రికిచ్చిన నివేదికలో పేర్కొన్నారని, ఈ మధ్య కాలంలో కూడా ఆక్రమణలకు గురైన భూములను కాపాడాలని ఇద్దరు సబ్–కలెక్టర్లు నిశాంత్‌కుమార్, హిమాంశు శుక్లా ఇచ్చిన ఆదేశాలను సభకు సమర్పించారు. ఇదే కాకుండా ఇతరత్రా నివేదికలను కూడా అందజేశారు. ఆధారాలతో సహా పూర్తి స్థాయిలో నివేదిక అందజేయడంతో కంగుతిన్న మంత్రి కలెక్టర్ తప్పుడు నివేదిక ఇచ్చారని నిర్ధారించుకున్నారు. ఆధారాలు పరిశీలించిన మంత్రి ఎలా సమాధానం చెప్పాలో తెలియక సభలో ఇబ్బందిపడ్డారు. తప్పకుండా ఆక్రమించినవారిపై, వాస్తవ, పూర్తి నివేదిక ఇవ్వనివారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెవిరెడ్డికి హామీ ఇచ్చారు. దీనిపై చెవిరెడ్డి స్పందిస్తూ ఈ ఆక్రమణలే కాకుండా చంద్రగిరి నియోజకవర్గంలోని స్వర్ణముఖి నదిలో 430 ఎకరాలు, భీమా నదిలో 220 ఎకరాలు ఆక్రమణదారుల పాలయ్యాయని తెలిపారు.
దీని కారణంగా 2016లో కురిసిన వర్షాలకు కాలువల్లో వెళ్లాల్సిన నీరు ఊర్లపైకి వచ్చిందన్నారు. దీనివల్ల పంట నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తప్పలేదన్నారు. చివరకు ప్రజలను రక్షించడానికి కేంద్రం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని చంద్రగిరికి పంపించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితి రాకుండా కాలువలు, గుంటలు, చెరువులు ఎవరు ఆక్రమించుకున్నా పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ అన్ని వివరాలతో మరోసారి తనను కలవాలని, తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రివిలేజ్ నోటిసిస్తా... కోర్టుకూ వెళ్తా
బాధ్యతారాహిత్యంతో, నిర్లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వానికి, చట్టసభలకు తప్పుడు నివేదిక ఇచ్చి తప్పుదోవ పట్టించినందుకు కలెక్టర్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వనున్నట్టు ఎమ్మెల్యే చెవిరెడ్డి తెలిపారు. అంతేకాకుండా పూర్తి ఆధారాలతో కోర్టుకు కూడా వెళ్లనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కలెక్టర్‌ను చిత్తూరు జిల్లా నుంచి బదిలీ చేయాలని సభలోనే ఉన్న ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.