సీపీఎస్ రద్దుకు జాతీయ స్థాయిలో పోరాటం
సీపీఎస్ రద్దుకు జాతీయ స్థాయిలో పోరాటం
Published Sun, Apr 9 2017 10:59 PM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM
భీమవరం టౌన్:కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) రద్దుకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఐక్య వేదికలను నిర్మించి పోరాటాన్ని ఉధృతం చేస్తామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సాబ్జి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటీఎఫ్) కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పి.జయకర్ అధ్యక్షతన ఆదివారం జిల్లా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న షేక్ సాబ్జీ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఉన్న పాత పెన్షన్ సౌకర్యాన్ని 2004 తరువాత ఉద్యోగాల్లో చేరిన వారికి రద్దు చేసి సీపీఎస్ విధానం అమలు చేయడం సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్దమన్నారు. పాత పెన్షన్‌స్కీమ్‌ను అందరికీ వర్తింప చేయాలని కోరుతూ ఉపాధ్యాయ, ఉద్యోగ కార్మిక సంఘాలతో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం చర్చించడం తప్ప పరిష్కారానికి ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించాఉ. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన నియమ నిబంధనలు డ్రాఫ్ట్ రూల్స్‌ను విద్యాశాఖ కమిషనర్ విడుదల చేసి గత నెల 8వ తేదిన అన్ని సంఘాలతో చర్చించి అభిప్రాయాలు తీసుకుంటారన్నారు. అయితే ఏకపక్షంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని ఆరోపించారు. ఉపాధ్యాయ సంఘాలు ప్రతిపాదించిన విధంగా బదిలీల్లో లాంగ్ స్టాండింగ్ 8 ఏళ్లు ఉంచాలని, వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్దతిలోనే మాన్యుల్ కౌన్సిల్ నిర్వహించాలని, పాయింట్లు కేటాయించడంలో ఫెర్పార్మెన్స్ విధానాన్ని తొలగించి, పాత పద్దతిలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో సమస్య పరిష్కారం కోరుతూ ఫ్యాఫ్టో, జాక్టో సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదిన టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ బహిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. యుటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపీ మూర్తి మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యమనేత సుబ్బరాజు శతజయంతి సభను ఈనెల 11న పోడూరు మండలం జిన్నూరులో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతీ ఒక్కరూ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్.జయప్రభ మాట్లాడుతూ మునిసిపల్ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియంతోపాటు తెలుగు మీడియంలోనూ తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీవీ నర్సింహరావు, జిల్లా నాయకులు సీహెచ్.జగన్మోహనరావు, బి.సుబ్బలక్ష్మి, ఏకేవీ రామభద్రం, ఆర్.రవికుమార్, ఎంఐ విజయ్‌కుమార్, పి.శివప్రసాద్, సుబ్రహ్మణ్యం, పి.శ్రీనివాస్, సువర్ణరాజు, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement