ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు.
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలైంది. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు జరిగిన ప్రాక్టికల్ పరీక్షలు జిల్లాలో 16,297 మంది విద్యార్థులు రాశారు. ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు తొలివిడత, 8 నుంచి 12 వరకు రెండో విడత, 13 నుంచి 17 వరకు మూడో విడత, 18 నుంచి 22 వరకు చివర విడతగా జరిగాయి. మార్చి 1 నుంచి 18 వరకు జరిగిన వార్షిక పరీక్షలకు మొత్తం 70,726 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 35,981 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 34,745 మంది ఉన్నారు.
ఒకేసారి ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు
గతంలో ప్రథమ సంవత్సరం ఫలితాలు విడుదల చేసిన కొన్ని రోజుల తర్వాత ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల చేసేవారు. అయితే గతేడాది నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెండూ ఒకేరోజు ఫలితాలను విడుదల చేస్తోంది. ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.