వేసవి సెలవులిచ్చారోచ్..
వేసవి సెలవులిచ్చారోచ్..
Published Sat, Apr 22 2017 10:52 PM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM
నేటి నుంచి జూన్ 11 వరకూ
విద్యార్థుల్లో వెల్లివిరిసిన ఆనందం
వేసవి సెలవులు వచ్చేశాయి.. బడిగంటకు విరామం దొరికింది.. విద్యార్థుల్లో ఆనందం వెల్లివిరిసింది. సెలవుల తర్వాత మళ్లీ కలుద్దామంటూ మిత్రులు వీడ్కోలు చెప్పుకున్నారు.
రాయవరం : పరీక్షలు ముగిశాయి..ఫలితాలు ప్రకటించారు..ప్రోగ్రెస్ కార్డులు చేతపట్టుకొని ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులు విద్యార్థులు వేసవి సెలవులిచ్చారంటూ ఆనందంగా ఇళ్లబాట పట్టారు. పొరుగు గ్రామాల స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ శనివారం మధ్యాహ్నం వరకూ పాఠశాలలో గడిపారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు పెట్టే, బేడా సర్దుకొని స్వగ్రామాలకు బయల్దేరారు. సాధారణంగా ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 23 ఆదివారం కావడంతో 22 చివరి పనిదినమైంది. 23 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ ఏడాది ప్రస్తుత విద్యా సంవత్సరం ( 2016–17) ముగియగానే కొత్త విద్యా సంవత్సరం (2017–18 ) ప్రారంభించారు. గత నెల 10 నుంచి 20వ తేదీ వరకు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు పరీక్షలు జరిగాయి. జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాల కింద 4,412 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 1,506 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలల్లో ఎనిమిది లక్షల మంది చదువుకుంటున్నారు. వీరందరికీ నేటి నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. దాంతో ఏడాది పాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు పట్టరాని సంతోషం కలిగింది. పాఠశాలలకు చివరి పనిదినం కావడంతో ఉపాధ్యాయులు పలు చోట్ల విద్యార్థులకు స్వీటు, హాట్‌తో పాటు రస్నా అందజేశారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని సూచనలిచ్చారు. విద్యార్థులకు సెలవులు ఇచ్చినా ఉపాధ్యాయులు మాత్రం ప్రమోషన్ జాబితా తయారీలో తలమునకలయ్యారు.
Advertisement