
నేడు తుందుర్రుకు వైఎస్ జగన్
⇒ మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులతో ముఖాముఖి
⇒ తణుకు సబ్‌జైలులో ఉద్యమకారిణి సత్యవతికి పరామర్శ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలను కలుసుకుని వారితో ముఖాముఖీ మాట్లాడతారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు తెలిపిన ప్రకారం జగన్ పర్యటన వివరాలిలా ఉన్నాయి.. వైఎస్ జగన్ బుధవారం ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడినుంచి నేరుగా తణుకు పట్టణానికి వెళతారు. 36 రోజులుగా అక్కడి సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న తుందుర్రు గ్రామస్తురాలు, ఆక్వా ఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యమకారిణి ఆరేటి సత్యవతిని పరామర్శిస్తారు. అక్కడినుంచి అత్తిలి, పాలకోడేరు, భీమవరం మీదుగా తుందుర్రు గ్రామానికి చేరుకుంటారు. ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారిని కలుసుకుని ముఖాముఖీ మాట్లాడతారు.