పోచంపల్లిలో భారీగా నష్టం
భూదాన్‌పోచంపల్లి : మండలంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షానికి పలు చోట్ల ఆస్తినష్టం వాటిల్లింది. రేవనపల్లి చెరువు అలుగుకు గండి పడడంతో చెరువులో ఉన్న సుమారు రూ.15 లక్షల విలువైన చేపలు కొట్టుకుపోయాయి. గౌస్‌కొండ గ్రామంలో చాంద్‌పాషకు చెందిన పెంకుటిల్లు ధ్వంసమైంది. ఇల్లు కూలి పక్కనే ఉన్న డబ్బా కొట్టుపై పడడంతో అది పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో రూ. 30వేల ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు పేర్కొన్నాడు.
నీటి మునిగిన వరి పొలాలు...
పోచంపల్లి, రేవనపల్లి చెరువులు ఉధృతంగా అలుగు పోస్తుండడంతో వాటి కింద ఉన్న సుమారు 100 ఎకరాలకు పైగా వరి పొలాలు నీటి మునిగాయి. సీతావానిగూడెంలో సద్దుపల్లి అంజిరెడ్డితో పాటు సమీప రైతులకు చెందిన సుమారు 10 ఎకరాలు, భీమనపల్లిలో బానోతు హనుమ అనే కౌలు రైతుకు చెందిన 3 ఎకరాలు, ముక్తాపూర్ గ్రామంలోని మూసీ కాల్వ పరివాహకంలో మరో 20 ఎకరాలు వరి నీట మునిగింది. అలాగే పోచంపల్లి చెరువు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రేవనపల్లి, శివారెడ్డిగూడెం, ఇంద్రియాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ కాల్వ నుంచి వరద నీరు వస్తుండడంతో మండలంలోని చెరువులన్నీ నిండి కళకళలాడుతున్నాయి. దోతిగూడెం ప్రాథమిక పాఠశాల ఆవరణలో పెద్ద ఎత్తున వర్షం నీరు నిలువడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. మండలంలో 69.2 వర్షపాతం నమోదైనట్లు ఏఎస్‌ఓ నర్సిరెడ్డి తెలిపారు.
అధికారుల సందర్శన...
ఇరిగేషన్ డీఈ రవీందర్, ఏఈ శాలిని, తహసీల్దార్ డి.కొమురయ్య, ఆర్‌ఐ నిర్మల, వీఆర్వో చెక్క నర్సింహ, సర్పంచ్ గోదాసు శశిరేఖజంగయ్య, సింగిల్‌విండో చైర్మన్ మర్రి నర్సింహారెడ్డి, గోదాస్ యాదగిరి బుధవారం గండిపడిన రేవనపల్లి చెరువు అలుగు గండిని పరిశీలించారు. వరద ఉధృతి తగ్గిన వెంటనే ఇసుక బస్తాలతో తాత్కాలికంగా గండి పూడ్చివేస్తామని డీఈ రవీందర్ తెలిపారు. మూడో విడత మిషన్ కాకతీయలో కట్ట, అలుగు, తూము మరమ్మతులు చేపట్టుతామన్నారు.