పర్యాటక హంగులు! | tourism in nagarkurnool dist | Sakshi
Sakshi News home page

పర్యాటక హంగులు!

Published Thu, Sep 15 2016 12:19 AM | Last Updated on Sat, Aug 11 2018 7:56 PM

పర్యాటక హంగులు! - Sakshi

పర్యాటక హంగులు!

కందనూలు జిల్లాకు పర్యాటక శోభ 
నల్లమలలో ప్రకృతి రమణీయ దృశ్యాలు 
ఈకో టూరిజం అభివృద్ధికి శ్రీకారం 
రూ.109కోట్లతో ప్రణాళికలు సిద్ధం  
 
కొత్తగా ఏర్పాటుకానున్న నాగర్‌కర్నూల్‌ జిల్లాకు పర్యాటక హంగులు కలగనున్నాయి. అచ్చంపేట, కొల్లాపూర్‌ నియోజకవర్గాల పరిధిలో కృష్ణా పరివాహక ప్రాంతంతో పాటు నల్లమల అడవులు ప్రకృతి అందాలకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయంగా ఉన్నాయి. ఈ ప్రాంతాలను పర్యాటకకేంద్రాలుగా మార్చేందుకు తెలంగాణ పర్యాటక శాఖ, అటవీ శాఖ సంయుక్తంగా ఈకో టూరిజం అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చాయి. ఆదిశగా ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించింది. కేంద్ర పర్యాటకశాఖ రూ.109కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది.  – అచ్చంపేట  
 
పేదల ఊటీ అభివృద్ధికి రూ.10.5కోట్లు
అచ్చంపేట ప్రాంతంలోని ఉమామహేశ్వర క్షేత్రం కింది కొండ బోగమహేశ్వరం వద్ద పర్యాటకుల కోసం కాటేజీలు, బేష్‌ క్యాంపు, కొండపైకి మొట్లు అభివృద్ధి వంటి పనులకు రూ.10.50 కోట్లకు టెండర్లు ఖరారు చేశారు. పేదల ఊటీగా అభివర్ణిస్తున్న ఉమామహేశ్వర క్షేత్రం ఇప్పటికే ప్రముఖ పర్యాటక కేంద్రంగా బాసిల్లుతోంది. మరోవైపు మల్లెల తీర్థం జలపాతం వరకు రోడ్డు అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు చేశారు. మల్లెలతీర్థం లోయలోకి వెళ్లేందుకు 270మెట్లు ఉన్నాయి. మెట్లదారి ఇబ్బందికరంగా ఉండటంతో వృద్ధులు, పిల్లలు సులువుగా ఎక్కేందుకు వాటి డిజైన్‌ మార్చడంతో పాటు రోప్‌వే ఏర్పాటు చే యనున్నారు. ఇక్కడ విద్యుత్‌ సౌకర్యం, సోలార్‌లైట్లు, డ్రస్సింగ్‌ రూమ్‌లతో పాటు పర్యాటకుల విశ్రాంతి కోసం షెడ్లు నిర్మాణం వంటి ప్రతిపాదనలు రూపొందించారు. 
 
 రూ.12కోట్లతో టెండర్లు 
ఫర్హాబాద్‌ వ్యూఫాయింట్‌ వద్ద కాటేజీలు, టూరిజం హోటళ్ల ఏర్పాటుకు రూ.12కోట్లు మంజూరు చేస్తూ టెండర్లు పిలిచారు. అన్ని హంగులతో కూడిన వసతులు, రాత్రివేళల్లో విడిది చేసేందుకు పల్లె వాతావరణాన్ని తలపించే సూట్లు, చెంచుల నివాసంలా ఉండే బొడ్డు గుడిసెల నమూనాలతో రూములు ఏర్పాటుకు ప్రతిపాదించారు. దట్టమైన అభయారణ్యంలో వ్యూపాయింట్‌ ఉంది. నల్లమలలోని అటవీ అందాలు, వన్యమృగాల సంచారాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆ ప్రదేశంలో జింకలు, నెమళ్లు, ఎలుగుబంట్లు, పులుల సంచారం బాగా ఉంటుంది. పర్యాటకుల రక్షణ కోసం వన్యమృగాల నుంచి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అటవీశాఖ సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతేడాది కేంద్ర పర్యాటకశాఖ ఆడిషనల్‌ డీజీ భారతీశర్మ కృష్ణానది తీరం వెంట ఏర్పాటు చేసే కాటేజీలు, స్టాల్స్, పర్యాటకంగా అభివృద్ధి చేసే ప్రాంతాలను పరిశీలించి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంలో పనులు ఊపందుకున్నాయి. వెనకబడిన అచ్చంపేట,కొల్లాపూర్‌ ప్రాంతాలకు మంచి గుర్తింపు, ఆదాయ వనరులు సమకూరడటంతో పాటు వ్యాపార సంబంధాలు బలపడనున్నాయి. 
 
పర్యాటకంగా రూపుదిద్దుకొనే ప్రాంతాలు..
శ్రీశైలం ఎడమగట్టు పాతాళగంగా, ఈగలపెంట, మల్లెలతీర్థం, అక్కమదేవి గుహలు, ఫర్హాబాద్‌ ప్యూపాయింట్‌ అందాలు, ఉమామహేశ్వరం క్షేత్రం, కొల్లాపూర్‌ మండలం సోమశిల లలితాంబికా సోమేశ్వరాలయం, సింగోటం లక్ష్మినర్సింహస్వామి ఆలయం, రత్నగిరి కొండ, శ్రీవారిసముద్రం ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. 
 
శ్రీశైలం–సోమశిల కృష్టానదిలో బోట్‌ ప్రయాణం
నల్లమల పర్యాటకకేంద్రాలను సందర్శించేందుకు పర్యాటకుల కోసం హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సోమశిలకు వాహనాల్లో చేరవేస్తున్నారు. సోమశిల నుంచి శ్రీశైలం క్షేత్రానికి కృష్ణానదిలో 80కిలోమీటర్ల దూరం. 80మంది పర్యాటకులు ప్రయాణించే సామర్థ్యం కలిగిన బోటు ఏర్పాటు చేశారు. ఎడమ పాతాళగంగ ఈగలపెంటలో కృష్ణానది ఒడ్డున 30అడుగుల ఎత్తయిన వాష్‌ టవర్‌ ఏర్పాటు చే సేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కృష్ణమ్మ ఓడిలో ప్రయాణిస్తే అతిపెద్ద శిలాతోరణంగా పేరున్న అక్కమ్మ బిలాన్ని చూడవచ్చు. తెలంగాణ ప్రభుత్వం అక్కమదేవి గుహలను సోమశిల, ఈగలపెంట నుంచి  చూపించే అవకాశం కల్పించింది. చుట్టూ ఎత్తయిన కొండలు, ఆకాశన్నంటే చుక్కల పర్వతం, జల సవ్వడుల మధ్య సాగే ప్రయాణం యాత్రికులకు మరిచిపోలేని అనుభూతినిస్తుంది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement