గిరిపుత్రులు.. పుష్కర పూజకు దూరం
గిరిపుత్రులు.. పుష్కర పూజకు దూరం
Published Mon, Aug 22 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
శ్రీశైలం ప్రాజెక్టు: అనాదిగా శ్రీశైల క్షేత్ర పరిధిలో ఎటువంటి పూజలు జరగాలన్నా ముందుగా చెంచు గిరిజనులనే ఆహ్వానించేవారు. రోడ్డు, రవాణా సౌకర్యం లేని కాలంలో శివుని సన్నిధిలో ప్రథమ పూజారులు చెంచు గిరిజనులే. అటువంటి వారికి కష్ణా పుష్కరాల సందర్భంగా అధికార యంత్రాంగం ఎటువంటి ప్రాధాన్యతన కల్పించలేదు. శ్రీశైలం క్షేత్ర సమీపంలో హఠకేశ్వరం సమీపంలోని అప్పటి లింగమయ్య చెంచుగూడెం, శిఖరేశ్వరం, మాణిక్యమ్మ సెల, మేకలబండ ప్రాంతంలో సుమారు 320 మంది గిరిజనులు నివసిస్తున్నారు. పుష్కరాల ప్రారంభం సమయంలో వారికి అధికార యంత్రాంగం ప్రాధాన్యత ఇవ్వకపోగా, కనీసం పుష్కరాలపై అవగాహనను కూడా ప్రభుత్వం కల్పించలేకపోయింది.
పుష్కరాలంటే మాకు తెలియదు: జెండాలమ్మ, చెంచుగూడెం
పుష్కరాలంటే మాకేందో తెలియదు సామీ. శివరాత్రి, ఉగాదిపండగలప్పుడు గుడిసారోళ్లు వచ్చి మమల్ని పిలుచుకుపోతారు. రథం ముందు చిందులు తొక్కమని చెబుతారు. చిందులు తొక్కినందుకు ఆ రోజుకు మాకు ఖర్చులకు డబ్బులు ఇస్తారు. ఆ పండగలు తప్ప, మాకు ఇంకొకటి తెలవదు. పుష్కరాలంటే భక్తులు వస్తారనే తెలుసు. అంతకుమించి ఏమి తెలవదు.
పుష్కర పూజకు పనికిరామా: గజ్జెల్, చెంచుగూడెం
శ్రీశైలంలో శివుడు కొలువైనప్పటి నుంచి మా తాత ముత్తాతలు ఆయనకు పూజలు చేసేవాళని చెబుతారు. మమల్ని కూడా శివరాత్రి, ఉగాది, ఇతర పండుగలప్పుడు ఆలయాన్ని కడగడం, శివలింగాన్ని కడగడం వంటి పనులకు పిలుస్తారు. మా చెంచోలంతా ఆ పండుగలప్పుడు ఎంతో సంబరం చేసుకుంటాం. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా పుష్కరాలకు మా జాతిని, మా సేవలను ఎవరు గుర్తించలేదు. ఏ పూజకు మమల్ని పిలవలేదు.
Advertisement
Advertisement