
టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లపై మంత్రి తుమ్మల సమీక్ష
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్ 15వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏప్రిల్ 27న ఖమ్మంలో జరిగే పార్టీ ప్లీనరీ, బహిరంగ సభల ఏర్పాట్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. అసెంబ్లీలోని తన చాంబ ర్‌లో ఆయన సోమవారం ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులతో భేటీ అయ్యారు. సభ నిర్వహణకయ్యే ఖర్చు, ప్రతినిధులు, బహిరంగ సభలు ఎక్కడ జరపాలి, జన సమీకరణ తదితర అంశాలపై చర్చించారు. పార్టీ ప్లీనరీ లోగా ఖమ్మం జిల్లాలో భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పదవులపైనా చర్చకు వచ్చింది.
ఖమ్మంలోని స్టేడియంలో బహిరంగ సభ, ఆ పక్కనే కాలేజీ మైదానంలో ప్రతి నిధుల సభకు ఏర్పాట్లు చేయాలన్న నిర్ణయం జరిగినట్లు చెబుతున్నారు. ఈ సమావేశం ముగియగానే కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలక మండళ్ల నియామకానికి సంబంధించిన జాబితాలతో మంత్రి హరీశ్‌ను కలిశారు. జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యే కనకయ్య, మదన్‌లాల్, వెంకటేశ్వర్లు, ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు బేగ్ తుమ్మలతో భేటీలో పాల్గొన్నారు.