భీమవరం పట్టణాభివృద్ధికి సహకరిస్తాం
Published Mon, Nov 7 2016 6:41 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM
రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికల్ వలవన్
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీతో కలిసి ఆకస్మిక సందర్శన
భీమవరం టౌన్ : భీమవరం పట్టణాభివృద్ధికి సహకరిస్తామని రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికల్ వలవన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ డి.మురళీధరరెడ్డి తెలిపారు. భీమవరం మునిసిపల్ కార్యాలయాన్ని వారు సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. కౌన్సిల్ హాల్లో పట్టణాభివృద్ధి పనుల ప్రగతి, 82 ఎకరాల్లో పేదలకు గృహ నిర్మాణం, అమృత్ పథకం, ఉద్యోగుల పోస్టుల ఖాళీలు, మాస్టర్‌ప్లాన్, బీపీఎస్, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సమీక్షించారు. మునిసిపాలిటీ ఆదాయ వ్యయాలు, ప్రజారోగ్యానికి తీసుకుంటున్న చర్యలు, అర్భన్ హెల్త్ సెంటర్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం పనుల్లో ప్రగతి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, చైర్మన్ కొటికలపూడి గోవిందరావు, మునిసిపల్ కమిషనర్ సీహెచ్ నాగనర్సింహరావు అభివృద్ధి పనుల ప్రగతి, అవసరాలు వివరించారు. గృహ నిర్మాణం చేపట్టాల్సిన 82 ఎకరాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైస్ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ పాలవెల్లి మంగ, టీడీపీ కౌన్సిలర్లు ములుగుర్తి వెంకటరామయ్య, మెంటే గోపి, ఎద్దు ఏసుపాదం, బీజేపీ కౌన్సిలర్ బొడ్డు దానయ్య పాల్గొన్నారు.
త్వరలో పేదలకు గృహయోగం
హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్‌లో గృహ నిర్మాణం చేపట్టే జాబితాలో భీమవరం పట్టణం చేరిందని, లబ్ధిదారుల జాబితాను అందిస్తే గృహాల నిర్మాణానికి ఆమోదం వస్తుందని ప్రిన్సిపల్ సెక్రటరీ కరికల్ వలవన్ తెలిపారు. త్వరలో మొదటి ఫేజ్‌లో 82 ఎకరాల్లో జీ ప్లస్ 3 తరహాలో పట్టణ పేదలకు రూ.522.50 కోట్లతో 9,500 గృహాలు నిర్మిస్తారని చెప్పారు. పట్టణంలో గృహాలకు 5,500 దరఖాస్తులు వచ్చాయి. ఆన్‌లైన్ చేసి ప్రభుత్వానికి పంపించామని కమిషనర్ చెప్పడంతో మొదటి ప్యాకేజీని మంజూరు చేస్తామని మిగిలిన 4 వేల దరఖాస్తులు ఇంకా అర్హులు ఉంటే వాటిని కూడా అందిస్తే 2వ ఫేజ్‌లో మంజూరు చేస్తామన్నారు.
Advertisement
Advertisement