
చంద్రబాబు మిత్రధర్మం పాటించమన్నారు
- వరంగల్ ఉప ఎన్నిక బరిలో ఎన్డీఏ అబ్యర్థే
- స్పష్టం చేసిన టీటీడీపీ అధ్యక్షుడు రమణ
విజయవాడ: వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నకలో టీడీపీ అభ్యర్థిని పోటీకి నిలపడం లేదని, ఎన్డీఏ అబ్యర్థి మాత్రమే పోటీ చేస్తారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో టీటీడీపీ నేతల కీలక భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
'వరంగల్ లో టీడీపీ అభ్యర్థినే నిలపాలని కార్యకర్తలు కోరారు. వారి అభ్యర్థనను అధినేత ముందుంచాం. అయితే మిత్రధర్మం పాటించాలని చంద్రబాబు చెప్పారు. అందుకే పార్టీ అభ్యర్థిని పోటీకి దించాలనే ఆలోచనను ఇంతటితో వదిలేస్తున్నాం. ఎడ్జీఏ అభ్యర్థే పోటీచేస్తారు' అని రమణ పేర్కొన్నారు. అయితే అభ్యర్థి ఎవరనే విషయం టీటీడీపీ అధ్యక్షుడ, టీ బీజేపీ అధ్యక్షుడు సంయుక్తంగా నిర్ణయిస్తారని, ఈ మేరకు చర్చలు జరపాల్సిందిగా చంద్రబాబు సూచించారని రమణ చెప్పారు.
పొత్తులో బాగంగా 2014 ఎన్నికల్లో వరంగల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగటం, కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోవడం తెలిసిందే. టీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి ఎంపీ పదవికి రాజీనామాచేసి ఎమ్మెల్సీగా ప్రమాణం చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ దఫా టీడీపీ అభ్యర్థినే పోటీకి దింపాలని స్థానిక నాయకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ ఇప్పటికే అభ్యర్థి ఎంపిక ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలిసింది. ముగ్గురి పేర్లతో కూడిన తుది జాబితాను ఢిల్లీకి పంపింది.