రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి
⇒ ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
ఇబ్రహీంపట్నం రూరల్ : రాష్ర్టంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ లో గల శ్రీచైతన్యం ఇంజనీరింగ్ కళాశాలలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, బీసీ ప్రంట్ అధ్యక్షుడు మల్లేష్‌యాదవ్‌లు కలిసి మొక్కలు నాటారు. ఆనంతరం కళాశాలలో నూతన విద్యార్థులకు , తల్లిదండ్రులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ర్టంలో 2లక్షల ఉద్యోగాలు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నాయన్నారు. 40వేల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని నింపకుండా విద్య వలంటీర్లతో ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. మిషన్ భగీరథ పథకం పెద్ద స్కాం అని అన్నారు. విద్యార్థులు చదువుకోవడానికి ఫీజు రియింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయకుండా ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందన్నారు. రాష్ర్ట బడ్జెట్‌లో రూ.36 వేల కోట్లు ఉద్యోగుల జీత భత్యాల కోసం కేటాయిస్తే ఉద్యోగుల భర్తీ చేయకపోవడం వల్ల రూ.10వేల కోట్లు మిగులుతున్నాయన్నారు. గ్రూప్-1,2,3,4 పోస్టులను భర్తీ చేయడం లేదని ఆర్.కృష్ణయ్య తెలిపారు. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథకు రూ.40వేల కోట్లు కేటాయించినా అసెంబ్లీలో తీర్మానం చేయకుండా ఇష్టం వచ్చినట్లుగా నిధులు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. అందులో రూ.10 వేల కోట్లు అవినీతి జరిగి ఉంటుందని.. వెంటనే సీఎం విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం సునీల్, నారాయణరెడ్డి, నారాయణ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.