కలెక్టర్‌కు లక్కపురుగుల బెడద! | un easy in collactarate | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌కు లక్కపురుగుల బెడద!

Published Wed, Sep 14 2016 10:16 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

పెద్దపల్లి ఐటీఐ

పెద్దపల్లి ఐటీఐ

  • పెద్దపల్లిలో గోదాం పక్కనే కలెక్టరేట్‌?
  • ఐటీఐపై అధికారుల తర్జన భర్జన
  • పెద్దపల్లి : కొత్త కలెక్టర్‌కు లక్కపురుగులు స్వాగతం పలకనున్నాయి. క్షేత్రస్థాయి అధికారుల అనాలోచిత నిర్ణయం.. ముందుచూపు లేమి కారణంగా ఉన్నతాధికారులు ఇబ్బందిపడే పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌ను పట్టణ శివారులోని ఐటీఐలో కొనసాగించాలని నిర్ణయించారు. కళాశాల ప్రహరీ పక్కనే సెంట్రల్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ బియ్యం గోదాములున్నాయి. ఇక్కడ నిత్యం లక్కపురుల బెడద తీవ్రంగా ఉంటోంది. చుట్టుపక్కల వారు ఏళ్లకు ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నారు. ఇళ్లలో ఉండలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కలెక్టరేట్‌ నిర్వహణ ఎలా సాధ్యమని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు కొందరు పురుగుల బెడద నివారించడానికి క్రిమిసంహారక మందు వాడకం మోతాదు పెంచాలని నిర్ణయించారు. క్రిమిసంహారక మందు వినియోగం పెంచితే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఏర్పడింది. మందు ప్రభావం ఎక్కువైతే నిల్వచేసిన బియ్యం మొత్తానికి పనికిరాకుండా పోతాయని నిపుణులు అంటున్నారు.
    గోస ఇప్పుడు తెలిసిందా..?
    రాఘవాపూర్‌లోని గోదాముల ద్వారా పుట్లకొద్డీ లక్కపురుగులు దాడిచేసి నిద్రలేకుండా చేస్తున్నాయని గ్రామస్తులు పలుమార్లు అధికారుల ఎదుట గోడువెళ్లబోసుకున్నారు. సమస్యను పరిష్కరించాలని కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అయినా ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు ఆ అధికారులే కలెక్టరేట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. లక్కపురుగులంటూ హైరానపడుతున్నారు. ‘మేం పడుతున్న గోస ఇప్పుడు అర్థమైతంది’ అని రాఘవాపూర్‌ గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని సంబరపడుతున్నారు.
    ఆందోళనకు సై..
    పెద్దపల్లి కలెక్టరేట్‌ను ఐటీఐలో నిర్వహించేందుకు అధికారులు తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఐటీఐని క్రమంగా కలెక్టరేట్‌ ఆక్రమిస్తే తాము ఎక్కడికి వెళ్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన పెద్దపల్లి ఐటీఐని అధికారులు ఉనికి లేకుండా చేసేందుకు కుట్రపన్నుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కొత్తకోర్సులతో వందలాది మందికి శిక్షణఇచ్చి ఉపాధి చూపాల్సిన ప్రభుత్వం.. ఉన్న ఐటీఐని లాక్కొని బయటికి పంపే ప్రయత్నం చేస్తోందని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తాత్కాలిక అవసరాల కోసం ఐటీఐని వాడుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారని, శాశ్వతంగా ఐటీఐని కలెక్టరేట్‌ స్వాధీనం చేసుకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఏబీవీపీ, ఏఐఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు స్పష్టంచేస్తున్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement