సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధికారం కోల్పోయామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తొలిసారి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని, మన సత్తా ఏంటో చూపిద్దామని పేర్కొన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, మున్ముందు మంచిరోజులు వస్తాయని శ్రేణులకు ఆయన ధైర్యం చెప్పారు.
బీఆర్‌ఎస్ పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో భాగంగా శనివారం పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేలందరం కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు.
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖరరావు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే ప్రజల మధ్యకు రానున్నారని తెలిపారు. హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ తరువాత కోలుకుంటున్న కేసీఆర్ జిల్లాల్లో పర్యటనలు జరుపుతారని చెప్పారు. వచ్చే నెలలో కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వచ్చి ప్రతిరోజూ కార్యకర్తలను కలిసేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు.
కేసీఆర్ ఫొటో తొలగించినా ప్రజల గుండెల నుంచి తొలగించలేరు..
కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేసే పనిలో ఉందని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ కిట్ మీద కేసీఆర్ గుర్తును కాంగ్రెస్ ప్రభుత్వం చెరిపేస్తోందనీ కిట్ నుంచి కేసీఆర్ ఫొటో, పేరును తొలిగిస్తారేమో కానీ తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరని వ్యా ఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రద్దులు, వాయి దాలు అన్నట్టుగా నడుస్తోందని ఎద్దేవా చేశారు.
ఈ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందన్నారు.కొన్ని చోట్ల వడ్ల పైసలు కూడా పడలేదని, రైతుబంధు ఇప్పటికీ వేయలేదని ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు వ్యవసాయం ఎలా చేయాలని ప్రశ్నించారు., ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
కీలక పోస్టింగ్‌లను రేవంత్ సోదరులే నిర్ణయిస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరులు అధికారిక మీటింగ్‌లలో పాల్గొనడం కుటుంబ పాలన కాదా అని ప్రశ్నించారు. రెవెన్యూ తదితర కీలకమైన శాఖల్లో పోస్టింగ్‌లను రేవంత్ సోదరులే నిర్ణయిస్తున్నారని, రేవంత్ మనుషులు విచ్చల విడిగా సిటీ చుట్టుపక్కల లే అవుట్‌లు వేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో ఎంపీ వెంకటేష్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు.
రేవంత్ కనీస హోం వర్క్‌చేయడం లేదు: కడియం
సీఎం రేవంత్‌రెడ్డికి ఎవరు బ్రీఫింగ్ ఇస్తున్నారో తెలి యదని, సీఎం దేనిపైనా కనీస హోం వర్క్ కూడా చేయడం లేదనిపిస్తోందని మాజీ మంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. ఫార్మా సిటీ, మెట్రో రైలుపై సీఎం వైఖరి కొన్ని రోజుల్లోనే మారిందన్నారు. అదానీని నాగపూర్‌లో విమర్శించిన సీఎం హైదరా బాద్‌లో అదే అదానీకి రెడ్ కార్పెట్ పరిచారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకా లను ప్రారంభించకపోగా, కేసీఆర్ పథకాలను రద్దు చేస్తోందని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని, గృహలక్ష్మి పథకం లబ్ధిదారులను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చేర్చి ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే గృహలక్ష్మి పథకాన్ని అలాగే కొనసాగించాలన్నారు. దళితబంధు పథకంలో సాయాన్ని పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఉన్న పథకాన్నే ఎత్తివేస్తూ దళితులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment