
అ‘డ్రస్’ లేదు
– యూనిఫాం పంపిణీలో సందిగ్ధం
– ఇప్పటిదాకా ఇండెంట్ కూడా తీసుకోని అధికారులు
– గత తప్పిదాలు పునరావృతం
ముదిగుబ్బ మండలంలో దాదాపు 80 స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో 1–8 తరగతుల విద్యార్థులు 6,900 మంది దాకా ఉన్నారు. 2016–17 విద్యా సంవత్సరంలో కేవలం ఏడు స్కూళ్ల విద్యార్థులకు మాత్రమే యూనిఫాం పంపిణీ చేశారు. తక్కిన స్కూళ్ల విద్యార్థులకు నేటికీ అందలేదు. జిల్లాలోని యూనిఫాం అందని ఇలాంటి స్కూళ్లు చాలానే ఉన్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ ఏడాది కూడా యూనిఫాం పంపిణీపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం మండలాల నుంచి ఇండెంట్‌కూడా తెప్పించలేదు. దీంతో యూనిఫాం పంపిణీపై ఈ ఏడాది కూడా సందిగ్ధం నెలకొంది.
- అనంతపురం ఎడ్యుకేషన్
ప్రభుత్వ పాఠశాలలు ఈ నెల 12న పునఃప్రారంభమయ్యాయి. సర్వశిక్షా అభియాన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1–8 తరగతుల విద్యార్థులకు సర్వశిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా ఏటా రెండు జతల యూనిఫాం సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 3,844 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలు ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో సుమారు 2,99,632 మంది విద్యార్థులు 1–8 తరగతుల విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు జతల ప్రకారం 5,99,264 జతల యూనిఫాం అవసరం. 1–7 తరగతుల బాలురకు చొక్కా నిక్కర్, బాలికలకు చొక్కా స్కర్టు ఇవ్వాలి. 8వ తరగతి బాలురకు షర్టు, ప్యాంటు, బాలికలకు పంజాబీ దుస్తులు ఇవ్వాలి. ఏటా పాఠశాలలు ప్రారంభమైన రెండు నెలలోపు ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈసారి ఇప్పటిదాకా కనీసం ఎంతమంది విద్యార్థులున్నారు... ఎంత వస్త్రం అవసరం అనే ఇండెంట్ కూడా మండల విద్యాశాఖ అధికారుల నుంచి తీసుకోలేదు. పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో విద్యార్థులు కొత్త యూనిఫాం ఇప్పట్లో అందే పరిస్థితి కనిపించడం లేదు. మండల విద్యాశాఖ అధికారుల ద్వారా ఇండెంట్ తీసుకుని ఆప్కో నుంచి వస్త్రం సరఫరా చేసి, కుట్టు పూర్తయి విద్యార్థులకు అందాలంటే 4–5 నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ఏటా ఇదే తంతు
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులు పాఠశాల ప్రారంభం రోజునుంచే యూనిఫాంతో తరగతులకు వెళ్తుండగా...సర్కారు బడుల్లోని విద్యార్థులకు మాత్రం ఈ పరిస్థితి లేదు. పాఠశాల నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వరకు అలసత్వం కారణంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనీఫాం పంపిణీలో ప్రతిసారీ ఆలస్యం జరుగుతోంది.
ఇండెంట్ తెప్పిస్తున్నాం
యూనిఫాంకు సంబంధించి అన్ని మండలాల విద్యాశాఖ అధికారుల నుంచి ఇండెంట్ తెప్పించుకుంటున్నాం. ఇప్పటిదాకా 20 మండలాల నుంచి వివరాలు అందాయి. ఈ నెల 28వ తేదీ వరకు గడువు ఇచ్చాం. ఇండెంట్ రాగానే రాష్ట్ర అధికారులకు పంపుతాం. ఇండెంట్ మేరకు వస్త్రం సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– సుబ్రమణ్యం, పీఓ, ఎస్‌ఎస్‌ఏ