
యూ'నో'ఫాం
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనందించేందుకు ప్రభుత్వ పెద్దలు అపసోపాలు పడుతున్నా.. క్షేత్రస్థాయిలో బాలారిష్టాలే దాటలేదు. ముఖ్యంగా అందరికీ సకాలంలో యూనిఫాం పంపిణీ చేయడం ప్రభుత్వానికి అధికారులకు గగనంగా మారుతోంది. ఏళ్లు గడుస్తున్నా.. ఈ సమస్యనే అధిగమించలేకపోతున్నారు. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడిచినా యూనిఫాం గురించి అతీగతీ లేదు. జిల్లా విద్యాశాఖాధికారులు యూనిఫాంకు ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో ఇంకా క్లాత్ కొనాలా వద్దా అంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారు.
షరా మూమాలే !
• యూనిఫాం పంపిణీలో తీరుమారని వైనం
• స్కూళ్లు పునఃప్రారంభమై రెండునెలలైనా అతీగతీ లేదు
• పాత, చిరిగిన దుస్తులతో వస్తున్న విద్యార్థులు
అనంతపురం ఎడ్యుకేషన్ : ఈ ఫొటోలో ఉన్న విద్యార్థులు అనంతపురం రూరల్ పాపంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థులు. వీరు వేసుకున్న స్కూల్ డ్రెస్ చూస్తే కొత్తగా కనిపిస్తోంది కదూ ! అచ్చు ప్రభుత్వం ఇచ్చే సరఫరా చేసే ఉచిత దుస్తుల్లా ఉన్నా.. ఇవి ప్రభుత్వం ఇచ్చినవి కాదు.. ఆ విద్యార్థుల తల్లిదండ్రులే కొనుగోలు చేసి కుట్టించారు.
ఈ విద్యార్థి పేరు సుధాకర్ అదే పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. యూనీఫాం లేక పోవడంతో గతేడాది ఇచ్చిన అంగీ వేసుకున్నాడు. గతేడాది ఇచ్చిన ప్యాంటు బిగుతు కావడంతో ప్రస్తుతం రంగుది ధరించాడు.
ఇదీ.. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యూనిఫాం పరిస్థితి.
సర్వశిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1–8 తరగతుల విద్యార్థులకు ఏటా రెండు జతల యూనిఫాం సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 3,844 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలు ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో సుమారు 2,82,845 మంది 1–8 తరగతుల విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు జతల ప్రకారం 5,65,690 జతల యూనిఫాం అవసరం. 1–7 తరగతుల బాలురకు చొక్కా నిక్కరు, బాలికలకు చొక్కా స్కర్టు ఇవ్వాలి.
8వ తరగతి బాలురకు షర్టు, ప్యాంటు, బాలికలకు పంజాబీ దస్తులు ఇవ్వాలి. గతేడాది (2015–16)కి సంబంధించిన యూనిఫాం నేటికీ కొన్ని పాఠశాలలకు ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ విద్యా సంవత్సరం సంగతి దేవుడికెరక. గతేడాదికి సంబంధించి ఫిబ్రవరిలో దుస్తులు ఇచ్చారని.. ఈసారి కూడా 2017 ఫిబ్రవరి, మార్చిలో ఇస్తారని చెబితేనే ప్రైవేట్‌గా కొనుగోలు చేస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా చాలామంది విద్యార్థులు పాత, చిరిగిన యూనిఫాంతో పాఠశాలలకు వస్తున్నారు.
ఇండెంట్‌తో సరి పెట్టారు : విద్యార్థులకు అవసరమైన యూనిఫాం క్లాత్ కొనుగోలుకు పాఠశాలల వారీగా ఎస్‌ఎస్‌ఏ అధికారులు ఇండెంట్ తెప్పించుకున్నారు. ప్రభుత్వానికి నివేదిక పంపారు. అక్కడి నుంచి ఇప్పటిదాకా ప్రతిస్పందన కరువైంది. క్లాత్ కొనుగోలు చేయాలా వద్దా .. ప్రభుత్వమే సరఫరా చేస్తుందా .. అనే విషయంలో నేటికీ స్పష్టత లేదు. ప్రతి ఏటా జూన్, జూలై మాసాల్లో ఈ పక్రియ పూర్తి అవుతున్నా.. ఈసారి ప్రభుత్వమే పెండింగ్ పెడుతూ వస్తోంది.
పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో విద్యార్థులు యూనిఫాం ధరించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుని క్లాత్ సరఫరా చేసి, కుట్టు పూర్తయి విద్యార్థులకు అందాలంటే సుమారు 4–5 నెలలు పట్టే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఏటా ఇతే తంతు అని, ప్రతిసారీ ఆలస్యం జరుగుతోందని ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు.