-
శంకుస్థాపన శిలాఫలకంపై కానరాని స్థానిక కార్పొరేటర్ పేరు
-
కార్పొరేటర్ లీలావతికి బదులు వద్దిరాజు గణేష్‌కు స్థానం
-
వీసీపై డీఆర్‌ఓకు ఫిర్యాదు
పోచమ్మమైదాన్ : రాష్ట్రంలోని వైద్య కళాశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పింది.
దీని శంకుస్థాపన కార్యక్రమంతోనే వివాదాలు మెుగ్గ తొడిగాయి. వరంగల్ కేంద్ర కారాగార ఆవరణలో హెల్త్ యూనివర్సిటీ భవనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు(ఆదివారం) మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి రిమోట్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. అయితే శంకుస్థాపన శిలాఫలకంలో కొన్ని పొరపాట్లు దొర్లాయి. దీనిపై 28వ డివిజన్ కార్పొరేటర్ యెలగం లీలావతి పేరు కాకుండా 27వ డివిజన్ కార్పొరేటర్ వద్దిరాజు గణేష్ పేరును పెట్టారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి సైతం స్థానిక కార్పొరేటర్ లీలావతికి ఆహ్వానం అందలేదు. ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందని హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డిపై స్థానిక కార్పొరేటర్ లీలావతి శనివారం డీఆర్వో శోభకు ఫిర్యాదు చేశారు.
పొరపాట్లను సరిదిద్దుతాం
ప్రధాని నరేంద్ర మోదీ నేడు శంకుస్థాపన చేయనున్న శిలాఫలకంపై పేర్ల విషయంలో ముద్రణ తప్పుగా జరిగింది వాస్తవమే. తెలంగాణ మెడికల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇంజినీర్ అందించిన పేర్లతో ఈ శిలాఫలకాన్ని తయారుచేయించాం. దాన్ని అమర్చే సమయంలో పొరపాట్లను సరిదిద్దుతాం.
– కరుణాకర్ రెడ్డి, వీసీ, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ