విలువైన శిక్షణ
విలువైన శిక్షణ
Published Sat, Oct 15 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM
బుట్టాయగూడెం : విలువిద్యలో గిరిజన విద్యార్థులు సంధించిన బాణంలా దూసుకుపోతున్నారు. టార్గెట్‌పై దృష్టిపెట్టి ముందుకు సాగిపోతున్నారు. పతకాలు సాధిస్తూ తద్వారా జిల్లాకు రాష్ట్రస్థాయిలో గుర్తింపును తీసుకువస్తున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించే ఈ విద్యకున్న విలువను తెలుసుకున్న కేఆర్‌పురం ఐటీడీఏ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. రూ.లక్షలు ఖర్చుతో క్రీడా సామగ్రి కొనుగోలు చేసి అందిస్తున్నారు. ఐటీడీఏ పరిధి ఏజెన్సీలోని అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఆసక్తి గల విద్యార్థులకు నిష్ణాతులైన గురువులతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు.
ఐటీడీఏ 10 ఏళ్లుగా విలువిద్య క్రీడా వస్తువుల కొనుగోలుకు ఒక్క పైసా కూడా విదల్చలేదు. అయినా ఐటీడీఏ పీవో, డీడీ ఆధ్వర్యంలో ఆర్చరీ సామగ్రి కిట్లు రూ.10 లక్షలతో కొనుగోలు చేశారు. ఐటీడీఏ పరిధిలో ఉన్న అన్ని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఈ రూ.8,900 విలువైన కిట్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. జాతీయస్థాయిలో పతకాలు సాధించిన ఆర్చరీ క్రీడాకారులతో పిల్లలకు శిక్షణ ఇప్పిస్తున్నారు. పలు చోట్ల వ్యాయామ ఉపాధ్యాయులకు కూడా కొద్ది రోజుల పాటు శిక్షణలు ఇచ్చారు. ఈ శిక్షణ ఐటీడీఏ పీవో ఎస్.షన్మోçßæన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో శిక్షణ పొందిన విద్యార్థుల్లో నలుగురు గత ఏడాది రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికైనట్టు డిప్యూటీ డైరెక్టర్ పి.మల్లికార్జునరెడ్డి తెలిపారు.
సృజనాత్మకతను వెలికి తీయాలనే..
గిరిజన విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలనే ఉద్దేశంతో వివిధ క్రీడల్లో తర్ఫీదు ఇస్తున్నాం. కబడ్డీ, వాలీబాల్, కోకో వంటి క్రీడలతో పాటు విలువిద్యలోనూ శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే ఆరుగురు రాష్ట్రస్థాయిలో వారి ప్రతిభను చాటారు. విద్యార్థులు జాతీయస్థాయిలో కూడా రాణించాలన్నదే మా ఆశ.– పి.మల్లికార్జున రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ డెప్యూటీ డైరెక్టర్, కేఆర్‌పురం ఐటీడీఏ
Advertisement
Advertisement