రెండు ఆటోలను ఢీకొట్టిన వ్యాన్‌ | Van crashed two autos | Sakshi
Sakshi News home page

రెండు ఆటోలను ఢీకొట్టిన వ్యాన్‌

Published Wed, Oct 12 2016 10:17 PM | Last Updated on Sat, Aug 25 2018 6:22 PM

రెండు ఆటోలను ఢీకొట్టిన వ్యాన్‌ - Sakshi

రెండు ఆటోలను ఢీకొట్టిన వ్యాన్‌

పది మందికి గాయాలు 
ఇద్దరి పరిస్థితి విషమం
 
ప్రత్తిపాడు: పదహారో నంబరు జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న బొలెరో వాహనం అదుపుతప్పి రెండు ఆటోలను ఢీకొట్టడంతో పది మంది గాయాలపాలైన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే బుధవారం మధ్యాహ్నం గుంటూరు నుంచి కర్నూలు జిల్లా నంద్యాల వెళుతున్న బొలెరో వాహనం ప్రత్తిపాడు మండలం ఈదులపాలెం వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి గుంటూరు నుంచి ప్రకాశం జిల్లా దర్శి వెళుతున్న పాసింజర్‌ ఆటోను ఢీకొట్టింది. అప్పటికీ వేగం నియంత్రణ కాకపోవడంతో  హైవేపై ఉన్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టి ఫెన్సింగ్‌ తెంచుకుంటూ సర్వీస్‌ రోడ్డులోనికి దూసుకువెళ్లింది. అదే సమయంలో సర్వీస్‌ రోడ్డులో వస్తున్న కాటూరి వైద్యశాలకు చెందిన టాటా ఏస్‌ ఆటోను కూడా ఢీకొట్టింది. 
 
పది మందికి గాయాలు..
ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న కర్నూలు జిల్లా కోయిలకుంట్లకు చెందిన డాక్టర్‌ జి. శివారెడ్డి (75), డ్రైవర్‌ కొమ్ము నాగోబులేసు (21), టాటాఏస్‌ ఆటోలో ప్రయాణిస్తున్న  యడ్లపాడు మండలం ఉప్పలపాడుకు చెందిన విప్పర్ల సురేష్‌ (29), కాటూరి వైద్యశాలలో స్టోర్‌ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న గుంటూరు రూరల్‌ మండలం వెంగళాయపాలెంకు చెందిన చతుర్వేది ఆనంద్‌కుమార్‌ (45), ప్యాసింజర్‌ ఆటోలో ప్రయాణిస్తున్న గుంటూరు కేవీపీ కాలనీకి చెందిన బోనాల సురేష్‌రెడ్డి (32), వేముల నాగరాజు (30), షేక్‌ శిలార్‌ (33), గండికోట నరసింహస్వామి (32), వేముల రవి (32),  గుంటూరు విరియంరాజు నగర్‌కు చెందిన కాటం శ్రీనివాస్‌ (30) తీవ్ర గాయాలపాలయ్యారు. పాసింజర్‌ ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురూ డ్రైవర్లు కాగా, టాటాఏసీ వాహనంలో ఉన్న ఇద్దరూ కాటూరి వైద్యశాలలో పనిచేస్తున్నారు.
 
కాటూరి వైద్యశాలకు తరలింపు..
గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే దగ్గరలోని కాటూరి వైద్యశాలలో చేర్పించారు. సమాచారం అందుకున్న ప్రత్తిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. గుంటూరు సౌత్‌జోన్‌ డీఎస్పీ బి.శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కర్నూలు జిల్లా కోయిలకుంట్లకు చెందిన డాక్టర్‌ జి.శివారెడ్డి కేఎల్‌యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ చదువుతున్న తన మనుమరాలిని కళాశాల వద్ద వదిలి తిరిగి నంద్యాలకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పాసింజర్‌ ఆటో నుజ్జునుజ్జు అవగా, టాటాఏసీ వాహనం తిరగబడి ధ్వంసమైంది. బొలెరో వాహనం ముందు రెండు టైర్లూ ధ్వంసమయ్యాయి.  ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement