శ్రీశైలంలో కొనసాగుతున్న వరుణయాగం
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో దేవస్థానం నిర్వహిస్తున్న వరుణ యాగం కొనసాగుతోంది. శనివారం రెండో రోజున యాగశాలకు నైరుతి భాగంలో ప్రత్యేకంగా నిర్మించిన తొట్టిలో నీళ్లు నింపారు. పూజల అనంతరం నలుగురు వైదికులు కంఠం మునిగే వరకు నీటిలో ఉండి నిరంతర వరుణ, రుష్యశృంగ జపాలను చేశారు. ఆ తరువాత ఆవాహన కలశాలను షోడశోపచారాలతో పూజించి, మండపంలో ఆవాహన చేసిన దేవతలకు ప్రత్యేకపూజల అనంతరం ప్రధాన కుండంలో యజ్ఞ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ యాగం ఈ నెల 29 వరకు కొనసాగుతుందని, ప్రతిరోజు రుద్రపారాయణలు, వరుణసూక్తపారాయణలు, చతుర్వేద పారాయణలు, వరుణజపాలు,రుశ్యశృంగజపం, విరాటపర్వపారాయణ కార్యక్రమాలను నిర్వహిస్తారని ఈవో నారాయణ భరత్ గుప్త తెలిపారు. 29న చివరి రోజున మల్లన్నకు జరిగే సహస్రఘటాభిషేక మహోత్సవంలో పాల్గొని శ్రీస్వామిఅమ్మవార్ల కపాకటాక్షాలను పొందాలని ఈవో కోరారు.