సాగర్ కుడి కాలువకు జలకళ
నీటిని విడుదల చేసిన అధికారులు
15 రోజుల్లో ఏడు టీఎంసీలు
మూడు నెలల పాటు తీరనున్న నీటికొరత
సీఈ వీర్రాజు వెల్లడి
విజయపురిసౌత్ : గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువకు అధికారులు శుక్రవారం నీటిని విడుదల చేశారు. సీఈ వీర్రాజు సాయంత్రం 5.50 గంటలకు స్విచాన్ చేసి 500 క్యూసెక్కుల నీటిని వదిలారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గంటకు 500 క్యూసెక్కుల చొప్పున పెంచుతూ అర్ధరాత్రికి నాలుగువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ విధంగా ఏడు టీఎంసీల నీటిని 15 రోజులపాటు విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే నీటి విడుదల సమాచారం రెండు జిల్లాల కలెక్టర్లకు అందించినట్లు చెప్పారు. ఈ నీటితో రెండు జిల్లాల్లోని కుంటలు, చెరువులు, నీటి ట్యాంకులు నింపనున్నట్లు తెలిపారు. ఈ నీటి ద్వారా మూడు నెలల పాటు నీటి కొరత తీరనున్నట్లు వివరించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ శాఖల అధికారుల సమన్వయంతో తాగునీటి కోసం కుడికాలువ చివరి వరకు చేరే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయన్నారు. ఈ సీజన్‌లో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులలో నీటిని నిల్వ చేసి రెండు పంటలతో పాటు తాగునీటి అవసరాలను తీర్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ప్రపంచ బ్యాంకు నిధులతో 2010 నుంచి చేపట్టిన కుడికాలువ ఆధునికీకరణ పనులలో భాగంగా ప్రధాన కాల్వల పనులు పూర్తయ్యాయని, బ్రాంచి కెనాల్స్ పనులు 90 శాతం పూర్తయ్యాయని చెప్పారు. 2017 మే కల్లా పనులు మొత్తం పూర్తవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కుడికాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ భుజంగరాయలు, సాగర్ డ్యామ్ ఎస్‌ఈ ప్రసాద్, ఈఈలు జబ్బార్, మొహినుద్దీన్, మాచర్ల– సత్తెనపల్లి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు నర్సింహారావు, తుమ్మల ఏడుకొండలు, డీఈ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, జేఈలు సత్యనారాయణ, కేశవరావు, లక్ష్మీనారాయణ, కృష్ణయ్య ఉన్నారు.