గుంతలో నిలిచిన వరదనీరు
-
పెరుగుతున్న నీటి మట్టం
-
కాంటూర్ కందకాల్లో జలకళ
ఎల్లారెడ్డిపేట : సిరిసిల్ల మెట్ట ప్రాంతంలోని అడవుల్లో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, కాంటూర్ కందకాల తవ్వకం, రాతి కట్టడాలు, చిన్నపాటి నీటి ఊటకుంటలు జలకళ సంతరించుకున్నాయి. ‘నీరున్న చోటే పంటలు పండుతాయ్.. చెట్లు ఉంటే వానలు పడుతాయ్’ నినాదాన్ని నిజం చేస్తున్నాయి. చెట్లు ఉన్న చోటే వర్షాలు పడతాయని సీఎం కేసీఆర్ హరితహారం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. అంతకు ముందే.. వీర్నపల్లి, కంచర్ల, అల్మాస్‌పూర్, మద్దిమల్ల, రంగంపేట అటవీ ప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో చిన్ననీటి ఊటకుంటలు, కాంటూర్ కందకాలు నిర్మించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో నీరు బూమిలోకి ఇంకుతోంది. బోర్లు, బావులతోపాటు చిన్ననీటి వనరుల్లో నీటి మట్టం పెరుగుతోంది.
వర్షాలతో జలకళ
వీర్నపల్లి అటవీ సెక్షన్‌లో గతేడాది నీటి నిల్వ సంరక్షణ పనులు చేపట్టారు. సుమారు 5,500 హెక్టార్ల విస్తీర్ణంలోని అటవీప్రాంతంలో దాదాపు 2,250 కాంటూర్ కందకాలు, రెండు చిన్ననీటి ఊటకుంటలు, 49 రాతి కట్టడాలు నిర్మించారు. కాంటూర్ కందకాల్లో చేరిన వర్షపునీరు భూమిలో ఇంకుతోంది. దిగువన ఉన్న ఒర్రెలు, కాలువల్లో ఊటలు నీటితో జలకళను సంతరించుకున్నాయి. అటవీ ప్రాంతంలో అధిక వర్షపాతం నమోవుతోంది. అటవీ గ్రామాల్లోనూ జోరువానలు కురుస్తున్నాయి. రాతి కట్టడాలతో వర్షపునీరు నెమ్మదిగా ప్రవహిస్తుండడంతో భూసారం కొట్టుకుపోకుండా, భూమి కోతకు గురికావడంలేదు. వన్య ప్రాణులకు పుష్కలంగా తాగునీరు లభిస్తోంది. సమీప గ్రామాల్లోనూ సాగునీటికి కొదవలేకుండాపోయింది.