మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరావు
- మొక్కలు నాటడంలో నిర్లక్ష్యాన్ని సహించం
- పోడు భూముల్లో గిరిజనేతరులపై పీడీ యాక్ట్
- రెండు, మూడు ఎకరాల్లో పంటలు ధ్వసం చేయవద్దు
- సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం జెడ్పీసెంటర్: హరితహారంలో రాష్ట్రంలోనే జిల్లా అగ్రప్రథంలో ఉందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని తెలిపారు. వెనుకంజవేస్తే పుంజుకోవడం కష్టమన్నారు. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని హెచ్చరించారు. హరితహారం అమలు తీరుపై టీటీడీసీ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సమీక్షించారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యం కంటే అదనంగా మరో కోటి మొక్కలను నాటేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ లక్ష్యాన్ని ఈనెల 10వ తేదీ వరకు పూర్తి చేయాలని ఆదేశించారు.
- అదనపు లక్ష్యం సాధించాలి
జిల్లాలో కోటి మొక్కల లక్ష్యం నేరవేర్చేందుకు ఇరిగేషన్, ఎన్నెస్పీ, మున్సిపాలిటీ, గిరిజన సంక్షేమం, డీఆర్‌డీఏ, అటవీశాఖ అధికారులు కేటాయించిన లక్ష్యం కంటే అధికంగా మొక్కలు నాటాలన్నారు. జిల్లాలో 3.50 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా మరో అదనంగా నాటాలన్నారు. వర్షాలు కురుస్తున్నందునా ఇదే అనుకూలం సమయం అన్నారు. ఉద్యాన, అటవీశాఖలు లక్ష్య సాధనలో వెనుకంజలో ఉన్న దృష్ట్యా వారు వేగం పెంచాలన్నారు. హరితహారం లక్ష్య సాధనలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పీఆర్, ఆర్‌అండ్‌బీ రోడ్లకు ఇరువైపులా వేసిన మొక్కలు భవిష్యత్తులో తొలగించకుండా ముందుగానే అనువైన ప్రదేశాల్లో నాటాలన్నారు. నగరంలో నాటిన మొక్కల సంరక్షణ కోసం ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో తిరిగే పశువులను గోశాలకు పంపుతామని ప్రచారం నిర్వహించాల్సిందిగా కమిషనర్‌ను ఆదేశించారు. అటవీభూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనేతరులపై పీడీ యాక్ట్ ప్రయోగించాలన్నారు. 2, 3 ఎకరాల్లో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనుల పంటలను ధ్వంసం చేయవద్దని, పంటలు పూర్తయిన తర్వాత అటవీశాఖ అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. లీజుకు తీసుకున్న గిరిజనేతర రైతుల వివరాలు సేకరించి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.
- ఇప్పటికి 2.97 కోట్ల మొక్కలు నాటాం: ఇన్‌చార్జ్ కలెక్టర్ దివ్య
హరితహారంలో జిల్లా లక్ష్యం 3.50 కోట్ల మొక్కలు కాగా ఇప్పటికే 2.97 కోట్లు నాటామన్నారు. రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో ఉందన్నారు. జిల్లాలో 2,700 హెక్టార్లలో మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అటవీశాఖ లక్ష్యం 53.70 లక్షలు కాగా ఇప్పటికే 37 లక్షల మొక్కలు నాటామన్నారు. 8 ప్రాంతాల్లో 365 హెక్టార్లలో సమస్యగా ఉందన్నారు. 53 లక్షల లక్ష్యాన్ని పూర్తి చేస్తామని, సమస్యాత్మక ప్రాంతంలో లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోయామన్నారు. అటవీశాఖ లక్ష్యాన్ని ఆగస్టు 15లోగా పూర్తి చేస్తామని తెలిపారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, హరితహారం ప్రత్యేక అధికారి రఘువీర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.