నిహారిక..నేనున్నా..!
⇒ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగు..
⇒ సర్కార్ తరపున సాయం అందించేందుకు కృషి..
⇒ భరోసనిచ్చిన సీఎం వ్యక్తిగత కార్యదర్శి స్మితాసబర్వాల్
పెగడపల్లి : ‘నిహారిక బాధపడకు... త్వరలో నీవు సంపూర్ణ ఆరోగ్యం పొందుతావు... నీకు కావాల్సిన సాయాన్ని ప్రభుత్వం తరపునా అందేలా కృషిచేస్తా..’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తి గత కార్యద ర్శి స్మితాసబర్వాల్ డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్న నిహారికకు భరోసానిచ్చింది. పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన సిగిరి కళావతి కూతురు నిహారిక(17) ఇంటర్ చదివింది. ఏడేళ్లుగా డయాబెటీస్‌తో బాధపడుతోంది. వ్యాధి నివారణ కోసం డయాబెటీస్ హోమిక్స్ ఆఫ్ ఇండియా సంస్థ నుంచి చికిత్స పొందుతోంది. హైదరాబాద్‌లోని మేక్ ఏ విష్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో నిహారిక పాల్గొంది. స్మితాసబర్వాల్ అంటే తనకు ఇష్టమని, ఆమెతో మాట్లాడాలని ఉందని తన కోరికను వెల్లడించింది.
దీంతో ఫౌండేషన్ చొరవతో మంగళవారం స్మితాసబర్వాల్ పెగడపల్లికి వచ్చారు. నిహారికను పరామర్శించి ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడారు. సుమారు గంటపాటు వారితో గడిపారు. కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మందులకు నెలకు రూ.5వేలు ఖర్చు అవుతున్నాయని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని, తమను ఆదుకోవాలని నిహారిక తల్లి కళావతి వేడుకుంది. దీంతో స్మితాసబర్వాల్ ‘వ్యాధి ఉందని బాధపడకుండా ముందుకు సాగితే విజయం సాధిస్తావు’ అని నిహారికకు ఆత్మస్థయిర్యం నింపారు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి సివిల్స్‌లో తర్ఫీదుపొంది మంచి ఉద్యోగం సాధించాలని ఆకాంక్షిచారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తాను చేస్తానని భరోసానిచ్చారు. స్వయం ఉపాధి కోసం వృత్తివిద్యలో శిక్షణ పొందాలని, ఏదైనా తాత్కాలిక ఉద్యోగం ఇప్పిస్తానని తల్లి కళావతికి సూచించారు. ఆమె వెంట జగిత్యాల సబ్‌కలెక్టర్ కృష్ణభాస్కర్, మేక్ ఏ విష్ ఫౌండేషన్ డాక్టర్ పుష్పదేవి, జెడ్పీటీసీ సభ్యురాలు వసంత, ఎంపీపీ సత్తయ్య, సర్పంచి రాజు ఉన్నారు.