మాట్లాడుతున్న డీఆర్వో జితేంద్ర
జిల్లాలో వెబ్‌ల్యాండ్ సమస్యలపై ప్రస్తావించేందుకు ఓ చక్కని వేదిక సాక్షి ఆధ్వర్యంలో ఏర్పాటైంది. రైతులంతా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని ఏకరువు పెట్టారు. దీనికిగల పరిష్కారాన్ని సైతం వారు సూచించారు. అధికారులు సానుకూలంగా స్పందించారు. రైతులనుంచి వినతులు స్వీకరించారు.
ప్రతి రెండు మండలాలకు ఒక ఉప కలెక్టర్‌తో గ్రామస్థాయిలో పరిశీలన
సాక్షి ఆధ్వర్యంలో వెబ్‌ల్యాండుపై అవగాహన సదస్సులో డీఆర్వో జితేంద్ర
గ్రామపురోణీల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు: ఆర్డీవో
వెబ్‌ల్యాండులో లోపాలపై రైతులు ఆందోళన
విజయనగరం గంటస్తంభం/రూరల్: జిల్లాలో వెబ్‌ల్యాండ్ సమస్యలపై ప్రస్తావించేందుకు ఓ చక్కని వేదిక సాక్షి ఆధ్వర్యంలో ఏర్పాటైంది. రైతులంతా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని ఏకరువు పెట్టారు. దీనికిగల పరిష్కారాన్ని సైతం వారు సూచించారు. అధికారులు సానుకూలంగా స్పందించారు. రైతులనుంచి వినతులు స్వీకరించారు.
వెబ్‌ల్యాండ్‌లో నెలకొన్న సమస్యల్ని డిసెంబర్ నెలాఖరునాటికి పరిష్కరిస్తామని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.జితేంద్ర స్పష్టం చేశారు. జిల్లాలో 1978లో జరిగిన ఎఫ్‌సీవో తప్పులున్నాయని, ప్రభుత్వ భూమిని జిరాయతీగా, జిరాయతీ భూములు ప్రభుత్వ భూములగా నమోదయ్యాయని చెప్పారు. 2012లో జరిగిన కంప్యూటరీకరణలో లోపాల వల్ల తప్పులు దొర్లాయని వివరించారు. ఇలాంటి సమస్యలన్నీ జిల్లా కలెక్టర్ దష్టికి తీసుకెళ్లామని, స్పందించిన ఆయన గ్రామస్థాయిలో పక్కాగా భూముల పరిశీలనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెండు మండలాలకు ఒక ఉప కలెక్టరును నియమించే ఆలోచన ఉందని చెప్పారు. సాక్షి ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన వెబ్‌ల్యాండుపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా మాట్లాడారు. రైతుల సమస్యలకు సూచనలు సలహాలు ఇచ్చారు. రైతులకు చదువు లేకపోవడం వల్ల భూసమస్యలు ఉత్పన్నమవుతున్నాయనీ, వెబ్‌ల్యాండు వచ్చిన తర్వాత మీసేవ ద్వారా అన్నింటికి పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. అక్కడ పరిష్కారం కాకుంటే జేసీ, కలెక్టర్‌కు ఆపీల్ చేయవచ్చని రైతులకు సూచించారు. మీ ఇంటికి మీభూమి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వాటిలో కొన్నింటిని పరిష్కరించామనీ, తాతల కాలం నాటి భూములు వారసత్వంగా విడగొట్టి సాగు చేస్తున్నారని, అలాంటివారు కూర్చొని వాటాలు తేల్చుకుని సాక్షి సంతకాలతో రాసిస్తే వారికి భూమి హక్కులు కల్పిస్తామన్నారు. నోటి అమ్మకాలు, గ్రామపురోణీలు ద్వారా అమ్మకాలు జరిగిన వాటికి అవకాశం ఇచ్చినా పరిష్కరించలేదని తెలిపారు. హక్కు సక్రమంగా ఉంటే వెబ్‌ల్యాండులో సవరణలు తప్పక చేస్తామన్నారు. ఇంకా తమ చేతిలో లేనివాటిని ప్రభుత్వం దష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు.
దశలవారీగా పరిష్కారం: జెడ్పీ సీఈఓ
జెడ్పీ సీఈవో రాజకుమారి మాట్లాడుతూ వెబ్‌ల్యాండుకు ముందు రికార్డులు కొంతమంది చేతిలో ఉండేవని, ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంటున్నాయని తెలిపారు. కుటుంబసభ్యులంతా రాసిస్తే వారసత్వ హక్కుల కల్పన పెద్ద సమస్య కాదన్నారు. దశలవారీగా రికార్డు శతశాతం ఫ్యూరిఫికేషన్ జరుగుతుందన్నారు. విజయనగరం ఆర్డీవో శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ గ్రామపురోణీల విషయం ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అంతవరకు భూయజమానులు తమ వివరాలు 1బిలో సాగుదారుల ఖాతాలో నమోదు చేసుకోవాలని సూచించారు. భూములు ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో ఎఫ్‌సీవోలో సమస్యలున్నాయన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య భూతగాదా తమకు సంబంధం లేదని, కోర్టులను ఆశ్రయించాలని సూచించారు. మీసేవలో పట్టాదారుపాసుపుస్తకం 60రోజుల్లో రావాలని, రాకుంటే జేసీకి ఆపీల్ చేయాలని సూచించారు.
రైతుల నుంచి స్పందన
సాక్షి ఆధ్వర్వంలో నిర్వహించిన వెబ్‌ల్యాండుపై అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించింది. విజయనగరం డివిజన్‌లో పలు ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. వెబ్‌ల్యాండులో ప్రస్తుతం ఉన్న లోపాలు ఎత్తిచూపారు. ఫలితంగా తాము పడుతున్న ఇబ్బందులు ఒక్కొక్కటి వివరించారు. పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. వెబ్‌ల్యాండు లోపాల వల్ల కలిగే నష్టాలు, అనర్థాలను రైతుసంఘాల నాయకులు గట్టిగా వివరించారు. సదస్సులో విజయనగరం తహసీల్దారు శ్రీనివాసరావు, రిటైర్డు తహసీల్దారు చంద్రుడు, రైతుసంఘం నాయకులు మర్రాపు సూర్యనారాయణ, బుద్దరాజు రాంబాబు, సింగుబాబు, రైతులు పాల్గొన్నారు.