ఖాదీ వస్త్రాలు పరిశీలిస్తున్న భూమయ్య
నరసన్నపేట: విశాఖ డివిజన్ పరిధిలో ఖాదీ ఉత్పత్తులు అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఖాదీ బోర్డు డైరెక్టర్ భూమయ్య అన్నారు. నరసన్నపేటకు సోమవారం వచ్చిన ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నరసన్నపేట కేంద్రానికి వంద చరకాలను, 12 మగ్గాలను ఇచ్చారు. తర్వాత ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ఖాదీ ఉత్పత్తులు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నకిలీ ఖాదీ ఉత్పత్తులు కూడా వస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. విశాఖ డివిజన్లో మూడు కేంద్రాలు ఉండగా దీంట్లో నరసన్నపేట కేంద్రం పనితీరు బాగుందన్నారు. యువతకు ఖాదీ పట్ల ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికీ రూ. 5 లక్షలు చొప్పున్న విశాఖ డివిజన్ పరిధిలో 400 మందికి రుణాలు ఇస్తామన్నారు. దీంట్లో 30 శాతం మార్జిన్ మనీ ఉంటుందన్నారు. ఆయన వెంట ఖాదీ అధికారులతో పాటు స్థానిక ప్రతినిధులు జగదీష్, వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.