
ఏం సాధించారని మళ్లీ జన్మభూమి?
ప్రభుత్వం శనివారం నుంచి తలపెట్టిన జన్మభూమి కార్యక్రమాన్ని సీపీఐ రాష్ట్ర కమిటీ తీవ్రంగా విమర్శించింది.
హైదరాబాద్: ప్రభుత్వం శనివారం నుంచి తలపెట్టిన జన్మభూమి కార్యక్రమాన్ని సీపీఐ రాష్ట్ర కమిటీ తీవ్రంగా విమర్శించింది. గత 18 నెలల్లో రెండు సార్లుగా నిర్వహించిన జన్మభూమి ఏమి సాధించిందో చెప్పి మళ్లీ ప్రారంభిస్తే బాగుండేదని మండిపడింది. బడుగు, బలహీన వర్గాలు రేషన్‌కార్డుల కోసం పెట్టుకున్న లక్షలాది దరఖాస్తులు మూలనపడి మూలుగుతుంటే మళ్లీ జన్మభూమంటూ ఊరూరా తిరుగుతారా? అని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శుక్రవారమిక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 12.5 లక్షల మంది అచ్చంగా రేషన్‌కార్డుల కోసమే ఎదురు చూస్తున్నారన్నారు.
గత జన్మభూముల్లో ప్రజల నుంచి 29 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, వాటిల్లో ఎన్ని పరిష్కరించారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రబీకి నీరు లేక రైతులు అల్లాడుతుంటే సమస్యను దాటవేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పాత సమస్యల పరిష్కారానికి మంత్రులు, ఇతర ఉన్నతాధికారులను నిలదీయాల్సిందిగా పార్టీ శ్రేణులకు రామకృష్ణ పిలుపిచ్చారు.