- గిరిజనులు, సాధారణ వ్యక్తులపై ప్రతాపం
- బడా శాల్తీలపై నామమాత్రపు కేసులు
- మొక్కుబడిగా పనిచేస్తున్న
- గుడుంబా నియంత్రణ కమిటీ
- జిల్లాలో కనుమరుగు కాని గుడుంబా
అక్రమార్కులపై చర్యలేవీ ?
Published Thu, Oct 6 2016 1:28 AM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM
సాక్షి, హన్మకొండ : పటిక, బెల్లం అమ్మకాలు, గుడుంబా తయారీ పేరు తో మహబూబాబాద్ ఎక్సైజ్ జిల్లా పరిధిలో ప్రతి ఏటా వేలాది కేసులు నమోదవుతున్నా గుడుంబా తయారీ ఆగడం లేదు. గుడుంబా వ్యాపారాన్ని శాసిస్తున్న బడా వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడంలో చూపిస్తున్న ఉదాసీనత కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోంది. మరోవైపు గుడుంబా తయారీనే జీవనోపాధిగా ఉన్న పేదలపై వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. మహబూబాబాద్ ఎక్సైజ్ పోలీసులు 2013–14 సంవత్సరంలో 1119 కేసులు నమో దు చేసి 420 మందిని అరెస్టు చేశారు. 2014–15 సంవత్సరంలో 1139 కేసులు నమోదు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. ఈ దశాబ్ధకాలంలో గుడుంబా అమ్మకాలు, తయారీ పేరుతో 25 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో వందల సంఖ్యలో యువకులు, మహిళలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
లోపాయికారి ఒప్పందం..
గుడుంబా నిర్మూలన చర్యలు కఠినతరం అవుతున్న కొద్దీ ఈ వ్యాపారంలో లాభాలు పెరుగుతున్నాయి. గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లాన్ని మార్కెట్ ధర కంటే రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. ధర ఎంత పెంచినా డిమాండ్ తగ్గకపోవడంతో కొందరు ‘పెద్దలు’ ఈ బెల్లం అక్రమ వ్యాపారంలోకి అడుగుపెట్టాయి. తమ వ్యాపారానికి అడ్డురాకుండా ఉండేందుకు వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి ఇబ్బంది రాకుండాæ వీరు మేనేజ్ చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే దాడుల్లో పట్టుబడిన సందర్భాల్లో బడా శాల్తీలపై తేలికరకం కేసులు పెట్టడం, అదుపులోకి తీసుకోకుండా పరారీలో ఉన్నాడని పేర్కొంటూ ఎక్సైజ్, పోలీసుశాఖ నుంచి లోపాయికారీగా సహాయ సహకారాలు అందుతాయని ఈ వ్యాపారంలో ఆరితేరిన వ్యక్తులు చెబుతున్నారు. రెండు నెలల క్రితం బెల్లం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అరగంట వ్యవధిలో ఆ వ్యక్తి పారిపోయినట్లు పేర్కొన్న ఉదం తం చర్చనీయాంశమైంది. గుడుంబా తయారీ, బెల్లం అక్రమ రవాణాలో భారీ లాభాలు చూసి సాధారణ వ్యక్తులు ఈ ఊబిలోకి వచ్చి కేసులతో విలవిలలాడుతున్నారు.
మొక్కుబడి కమిటీ..
గుడుంబా నిర్మూలించేందుకు ఎక్సైజ్, పోలీసుశాఖలతో పాటు డీఆర్‌డీఏ పీడీ ఆధ్వర్యంలో ఎనిమిది నెలల కిందట ఏర్పాౖటెన గుడుంబా నియంత్రణ కమిటీ పనితీరు మొక్కుబడిగా మారింది. గుడుంబా ప్రభావిత ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, వాట్సప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించడం ఈ కమిటీ విధులు. తమకు అందిన ఫిర్యాదులను ఎక్సైజ్, పోలీసు, రెవిన్యూ తదితర శాఖలకు అందించి తగు చర్యలు తీసుకునేలా పర్యవేక్షణ చేయాల్సి ఉంది. గుడుంబా నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో గుడుంబాను అరికట్టకలిగాయి. అయితే మన జిల్లా కమిటీ పనితీరు మొక్కుబడి కార్యక్రమాలకే పరిమితం కావడంతో గుడుంబా వ్యాపారం యదేచ్ఛగా కొనసాగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.
Advertisement
Advertisement