వాచ్‌మన్ మృతికి కారకులెవరు?
- మునిసిపల్ కార్యాలయం ఎదుట శవంతో ఆందోళన
- లంచం ఇవ్వలేకే నాన్న మృతి : కుటుంబ సభ్యులు
- ఇది సర్కార్ హత్యే : వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త సిద్ధారెడ్డి
కదిరి మునిసిపాలిటీలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న నరసింహులు (56) శనివారం గుండెపోటుతో మృతిచెందాడు. ఉద్యోగంలో ఉండాలంటే లంచం ఇవ్వాల్సిందేనంటూ ఓ టీడీపీ నాయకుడు డిమాండ్ చేసిన కొద్ది గంటల్లోనే ఆయన ఊపిరి ఆగిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు శవాన్ని మునిసిపల్ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.
నరసింహులు 20 ఏళ్లుగా నైట్ వాచ్‌మన్‌గా కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నాడు. మునిసిపాలిటీలో టీడీపీ పాలకవర్గం కొలువు దీరగానే.. అప్పటివరకు ఉన్న కార్మికులను తొలగిస్తామని ఆ పార్టీ నాయకులు కొందరు చెప్పారు. దీంతో ప్రతికార్మికుడూ ఉద్యోగం కాపాడుకునేందుకు రూ.30 వేల నుంచి రూ.70 వేల దాకా సమర్పించుకోవలసి వచ్చింది. ‘నన్ను ఉద్యోగం నుంచి తొలగించకండయ్యా..కొడుకు చదువు ఆగిపోతుంది’ అని నరసింహులు అప్పుచేసి మరీ రూ.50 వేలు సదరు నాయకులకు సమర్పించుకొని అప్పట్లో తన ఉద్యోగాన్ని నిలుపుకున్నాడు. తాజాగా శనివారం అదే నాయకుడు మున్సిపల్ కార్యాలయం వద్ద కలిసి ‘నీ గడువు జూన్ 30తో పూర్తయింది. మళ్లీ కొనసాగాలంటే ఇప్పుడు మళ్లీ రూ.30 వేలు ఇవ్వాలి’ అని చెప్పడంతో నరసింహులుకు అక్కడే గుండె ఆగినంత పనైంది. దిక్కుతోచక ఇంటికెళ్లి విషయం చెప్పి సృహతప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే గుండె ఆగిపోయిందని వైద్యులు చెప్పడంతో భార్య సుబ్బమ్మ, కుమారుడు సురేష్, కూతుర్లు, బంధువుల కన్నీరు మున్నీరుగా విలపించారు.
మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన :
వాచ్‌మన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, బం«ధువులు వాహనంలో మున్సిపల్ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి నిరసన తెలియజేశారు. ఈలోగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అక్కడికి చేరుకున్నారు. ‘మీకివ్వాలని చెప్పి మీ అనుచరులు మా నాన్న దగ్గర గతంలో రూ.50 వేలు తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఇంకా రూ.30 వేలు ఇవ్వాలని వచ్చారు. అందుకే మా నాన్న గుండె ఆగి చనిపోయాడు’ నరసింహులు కుటుంబ సభ్యులు ఆయన ఎదుటే విలపించారు. ఇందుకు కందికుంట ఆగ్రహిస్తూ ‘నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వకండి. వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పండి’ అని తెలియజేశారు. మీ కుటుంబాన్ని ఆదుకుంటానని అక్కడినుంచి వెళ్లిపోయారు.
రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
విషయం తెలుసున్న వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి వెంటనే మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు ‘ఇది పూర్తిగా సర్కారు హత్యే. కార్మికులను ఉద్యోగంలో కొనసాగించాలంటే అధికార పార్టీ నాయకులకు ముడుపులెందుకివ్వాలయ్యా..? దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మృతుని కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం వారికి నచ్చజెప్పి అంత్యక్రియల కోసం మృతదేహాన్ని స్వగ్రామం అమడగూరు మండలానికి తరలించేలా చేశారు.