సబ్‌ప్లాన్ నిధులతో పనులు ప్రారంభించరా..?
-
ఎమ్మెల్యేలు అనిల్, కోటంరెడ్డి
నెల్లూరు సిటీ: రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లలో సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టిన పనులు చివరి దశలో ఉండగా, మంత్రి నారాయణ సొంత జిల్లాలోని కార్పొరేషన్లో మాత్రం ఇప్పటికీ ప్రారంభంకాలేదని నెల్లూరు నగర , రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. సబ్‌ప్లాన్ నిధుల పనులు ప్రారంభం కాకపోవడంపై మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లును వారు కలిశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడారు. నెల్లూరు కార్పొరేషన్‌కు మంజూరైన సబ్‌ప్లాన్ నిధులు రూ.38 కోట్లతో పనులు ప్రారంభం కాకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేషన్లో కాంట్రాక్టర్లు సిండికేటై 8 ప్యాకేజీలుగా చేశారన్నారు. సెప్టెంబర్ ఏడో తేదీలోపు టెండర్లను పిలుస్తామని కమిషనర్ చెప్పారని, 15లోపు ప్రక్రియ పూర్తికాకపోతే కార్పొరేషన్ కార్యాలయానికి తాళాలను వేస్తామని హెచ్చరించారు. అనంతరం కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల అభివృద్ధికి నిధులు వచ్చాయని చెప్పారు. కార్పొరేషన్ అభివృద్ధికి మంత్రి నారాయణ నిధులను తీసుకురావాల్సి ఉందని, అయితే ఉన్న నిధులతో కూడా పనులను ప్రారంభించలేదని దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో సైతం కార్పొరేషన్ తీరును ఎండగడతామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ పోలుబోయిన రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, ఊటుకూరు మాధవయ్య, గోగుల నాగరాజు, దేవరకొండ అశోక్, నాయకులు కుంచాల శ్రీనివాసులు, వందవాసి రంగ, మునీర్ సిద్ధిఖ్, ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు.