అక్రమ సంబంధంతోనే హత్య
♦ ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు భార్య పథకం
♦ దారుణానికి ఒడిగట్టిన తిర్మలాపూర్ సర్పంచ్ యాదవరెడ్డి
♦ పోలీసుల అదుపులో నిందితులు వీడిన మిస్సింగ్ మిస్టరీ
♦ తిర్మలాపూర్‌లో శవం వెలికితీత
దౌల్తాబాద్: అక్రమ సంబంధం చివరకు హత్యకు దారితీసింది. ప్రియురాలి భర్త తమ వ్యవహారానికి అడ్డుగా నిలుస్తాడని భావించిన ప్రియుడు అతడిని హతమార్చేందుకు పన్నాగం పన్నాడు. ఆమె సాయంతో వెన్నంటే వెళ్లి అంతమొందించాడు. ఏమీ తెలియనట్టుగా మూడు నెలలపాటు జనంలో సంచరించిన వారు కటకటాలపాలయ్యారు. సెల్‌ఫోన్ సంభాషణలు వారి గుట్టురట్టు చేశాయి. మిస్సింగ్ మిస్టరీ వీడింది. స్థానికులు, మృతుడి బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... గజ్వేల్ పట్టణంలో టీవీ మెకానిక్‌గా పనిచేసే మాస అచ్చారావు(40)కు జగదేవ్‌పూర్ మండలవాసి కవితతో 18 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కవిత గజ్వేల్‌లోనే ఓ బ్యూటీ పార్లర్ నిర్వహించేది.
కాగా సుమారు రెండు, మూడేళ్ల క్రితం దౌల్తాబాద్ మండలం తిర్మలాపూర్ సర్పంచ్ సర్వుగారి యాదవరెడ్డితో కవితకు పరిచయం ఏర్పడింది. అది అక్రమ సంబంధానికి దారితీసింది. విషయం కొంతకాలానికి ఆమె భర్త అచ్చారావుకు తెలిసింది. పలుమార్లు ఆమెను మందలించినా బుద్ధి మారలేదు. ఈ క్రమంలోనే అచ్చారావు ఏడాది క్రితం గజ్వేల్‌లో టీవీ మెకానిక్ దుకాణం తీసేశాడు. సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓ టీవీ షోరూంలో ఎలక్ట్రీషియన్‌గా పనికి కుది రాడు. నిత్యం బస్సులో జూబ్లీ బస్టేషన్ వరకు బస్సులో వెళ్లి అక్కడి నుంచి తన ద్విచక్రవాహనంలో విధులకు వెళ్లేవాడు.
మూడు నెలలుగా అదృశ్యం
కాగా అచ్చారావు 3 నెలల క్రితం అదృశ్యమయ్యాడు. జనవరి 13 నుంచి అతను ఇంటికి రాలేదు. తన భర్త ఇంటికి రాలేదని కవిత ఇచ్చిన సమాచారం మేరకు ఆమె సోదరుడు మహిపాల్‌రెడ్డి 14న సికింద్రాబాద్ వెళ్లి వాకబు చేశాడు. బంధువులనూ ఆరా తీశాడు. అయినా ఫలితం లేకపోవడంతో అదే రోజు సాయంత్రం మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో అచ్చారావు కన్పించడం లేదని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని అక్కడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పథకం ప్రకారం..
కాగా సినీ పక్కీలో అచ్చారావు హత్యచేసేందుకు నిందితులు పథకం రూపొం దించారు. నిత్యం బస్సులో వచ్చే అచ్చారావును అతడి భార్య కవితతో ఫోన్ చేయించి ద్విచక్రవాహనంపై వచ్చే విధంగా పథకం పన్నారు. తను జూబ్లీ బస్టాండు నుంచి బైక్‌పై బయల్దేరానని ఫోన్‌లో చెప్పగానే కవిత ఈ విషయాన్ని యాదవరెడ్డికి చేరవేసింది. దీంతో అప్పటికే తిర్మలాపూర్‌కు చెందిన కన్నారెడ్డి, ఆంజనేయులు గౌడ్‌లతో కలిసి రహదారిపై మాటువేసిన యాదవరెడ్డి..
తుర్కపల్లి సమీపంలోకి రాగానే బైక్ వెనుక నుంచి అదే గ్రామానికి చెందిన కృష్ణకు చెందిన మాక్స్ వాహనంతో ఢీకొట్టారు. కిందపడిన అచ్చారావును అందరూ కలి సి వెనక చేతులు కట్టేసి అదే వాహనంలో వేసుకుని దౌల్తాబాద్ మండలం తిర్మలాపూర్‌కు తీసుకువచ్చారు. అక్కడ యాదవరెడ్డికి చెందిన పౌల్ట్రీఫారాల సమీపంలోని చెరువు దగ్గరకు తీసుకెళ్లారు. చేతులకు కట్టిన తాడుతోనే మెడకు బిగించి హతమార్చారు. అక్కడ అప్పటికే తీసిన జేసీబీ గుంతలోకి తోసేసి మట్టిపోశారు.
సెల్‌ఫోన్‌తో గుట్టురట్టు..
కేసు దర్యాప్తులో భాగంగా ఈస్ట్‌మారేడ్‌పల్లి పోలీసులు సెల్‌ఫోన్ ట్యాపింగ్‌తో గుట్టురట్టు చేశారు. 3 నెలల నుంచి యా దవరెడ్డి, కవిత ఫోన్ నంబర్లను ట్యాప్‌చేశారు. వారి సంభాషణల ఆధారంగా వివరాలు సేకరించిన పోలీసులు కొంతకాలంగా తిర్మలాపూర్‌లో రెక్కీ నిర్వహించి పూర్తి వివరాలు సేకరించారు. మాక్స్ డ్రైవర్ కృష్ణను ముందుగా అదుపులోకి తీ సుకుని విచారించి నిందుతులను గుర్తిం చారు. కృష్ణతోపాటు యాదవరెడ్డి, ఆంజ నేయులుగౌడ్, కన్నారెడ్డి, కవితలను అ దుపులోకి తీసుకున్నారు. కాగా శనివారం ఉదయం యాదవరెడ్డిని తిర్మలాపూర్‌కు తీసుకువచ్చి అచ్చారావును పాతిపెట్టిన చోటును గుర్తించారు.
అహ్మద్‌నగర్‌లోని అతడి ఇంటికి తీసుకెళ్లి అక్కడ మారణాయుధాలను సేకరించారు. అనంతరం జేసీబీతో 10 అడుగుల లోతులో నుంచి శవాన్ని వెలికితీశారు. రెవెన్యూ సిబ్బంది సమక్షంలో గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి నుం చి వచ్చిన డాక్టర్ కళాధర్ సంఘటన స్థలంలోనే పంచనామా నిర్వహించారు. ఈస్ట్‌మారేడ్‌పల్లి సీఐ ఉమామహేశ్వర్‌రావు, తొగుట సీఐ వెంకటయ్య, ఎస్‌ఐలు పరుశురాం, కృష్ణలు వివరాలు నమోదు చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు చెప్పారు.
టీఆర్‌ఎస్ నుంచి యాదవరెడ్డి సస్పెన్షన్
తిర్మలాపూర్ సర్పంచి యాదవరెడ్డిని టీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రకటించారు. ఆయన శనివారం సాక్షితో ఫోన్‌లో మాట్లాడారు. మేకవన్నె పులిలా తిరిగిన యాదవరెడ్డి తీరును ఉపేక్షించబోమన్నారు.
గజ్వేల్‌లో కలకలం...
ఇదిలా ఉంటే అచ్చారావు హత్యోదంతం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గజ్వేల్ పట్టణంలో కలకలం రేగింది.