శిల్పాను భారీ మెజార్టీతో గెలిపించండి | Win the sculpture with a huge majority | Sakshi
Sakshi News home page

శిల్పాను భారీ మెజార్టీతో గెలిపించండి

Published Fri, Jul 21 2017 3:51 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

శిల్పాను భారీ మెజార్టీతో గెలిపించండి - Sakshi

శిల్పాను భారీ మెజార్టీతో గెలిపించండి

నంద్యాల ప్రజలకు ఎంపీ అవినాష్‌రెడ్డి పిలుపు
పట్టణంలో విస్తృత ప్రచారం


నంద్యాల అర్బన్‌: ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల ప్రజలకు, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబానికి మధ్య చక్కటి అనుబంధం ఉందన్నారు.  ప్రతి ఎన్నికలోనూ ప్రజలు వైఎస్‌ కుటుంబంపై అభిమానాన్ని చూపుతున్నారన్నారు. ఇప్పుడు కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పోటీ చేస్తున్న శిల్పా మోహన్‌రెడ్డిని ఆదరించాలని కోరారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం ఎంపీ అవినాష్‌రెడ్డి  నంద్యాల ఒకటో వార్డులోని అరుంధతినగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా విన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల సమయంలో వైఎస్సార్‌ చేసిన సహాయాన్ని నంద్యాల ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరన్నారు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో ఆమోదించిన తొమ్మిది పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కరెంట్‌ బిల్లులు, ఆర్టీసీ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు.. ఇలా ప్రతిదీ పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందని విమర్శించారు. జగనన్న ప్రభుత్వం వస్తే పెరిగిన ధరలను నియంత్రించడమే కాకుండా పింఛన్ల పెంపు, రైతు భరోసా తదితర ఎన్నో ప్రయోజక పథకాలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ కన్నమ్మ, పార్టీ నాయకులు కల్లూరి రామలింగారెడ్డి, వైఎస్సార్‌ జిల్లా  పార్టీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ పులికుమార్, కోలా భాస్కర్, సోమసుందరం మాదిగ, మద్దయ్య, ఎల్లయ్య, శీను తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement