పెద్ద నోట్ల రద్దుతో కుంటుపడిన అభివృద్ధి
పడిపోయిన జాతీయ స్థూల ఆదాయం
జనవేదన సమ్మేళన్ జిల్లా కోఆర్డినేటర్ మర్రి ఆదిత్యరెడ్డి
వరంగల్ : కేంద్రప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేయడంతో దేశంలో అభివృద్ధి కుంటుపడిందని జనవేదన సమ్మెళన్ జిల్లా కోఆర్డినేటర్ మర్రి ఆదిత్యరెడ్డి అన్నారు. డీసీసీ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అభివృద్ధి తిరోగమన దిశలో పడిందన్నారు. ఈ రద్దుతో జాతీయ స్థూల ఆదాయం 2 శాతం కంటె ఎక్కువ పడిపోయిందన్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ లెక్కల ప్రకారం 50 రోజుల్లో రూ.లక్షా 28వేల కోట్ల నష్టం జరిగిందన్నారు.
రాబోయే ఎన్నికల్లో కేంద్రం, రాష్టంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నోట్ల రద్దు ఒక పెద్ద కుంభకోణమని దీనికి వ్యతిరేకంగా గ్రామ, మండల స్థాయిల్లో ప్రజలను జాగృతం చేసి ఈనెల 27న హైదరాబాద్ తిరుమలగిరిలోని జయలక్ష్మీ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న జనవేదన సమ్మెళనంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి కోరారు. సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి అజ్మతుల్లా హుస్సేనీ, గ్రేటర్ కాంగ్రెస్ అ«ధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షుడు రాజనాల శ్రీహరి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మంద వినోద్‌కుమార్, లక్ష్మారెడ్డి, మానుపాటి శ్రీను, మండల వెంకన్న, సంజీవరెడ్డి, విజయ్, అయూబ్, రాధా, లక్ష్మణ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.