తాగునీటి కోసం పురం మహిళల ధర్నా
- బెంగళూరు రోడ్డులో స్తంభించిన ట్రాఫిక్
హిందూపురం అర్బన్: ఎన్నిసార్లు ధర్నాలు చేసినా పురం నీటి కష్టాలపై ఎమ్మెల్యే బాలకృష్ణ కాని, అధికారులు కాని స్పందించడం లేదంటూ పలువురు మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. హిందూపురంలోని బోయపేట సమీపంలోని ఎన్టీఆర్ సుజల ప్లాంట్ ఎదుట స్థానిక మహిళలు శనివారం పెద్ద సంఖ్యలో ధర్నా చేపట్టారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. 15 రోజులుగా ప్లాంట్ నుంచి తాగునీరు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోయపేట, బెంగళూరురోడ్డు ప్రాంతాలకు 20రోజులు పైబడి కొళాయిలకు నీరు వదలేదన్నారు.
నీటి సమస్యను పరిష్కరించే వరకూ అక్కడి నుంచి కదలబోమంటూ భీష్మించారు. దీంతో బెంగళూరు రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు అక్కడకు చేరుకుని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తే మహిళలు వినలేదు. చివరకు మున్సిపల్ వైస్ చైర్మన్ రాము, టీడీపీ నాయకులు చేరుకుని వారికి నచ్చచెప్పారు. వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి వాటర్‌ప్లాంట్ సంప్‌ని నింపి, నీటి సరఫరాను పునరుద్ధరించారు. దీంతో మహిళలు ఆందోళనను విరమించారు.