
ఓయూ లైబ్రరీ.. అంతా వర్రీ
ఓయూ క్యాంపస్‌లోని యూనివర్సిటీ ప్రధాన లైబ్రరీ సమస్యలకు నిలయంగా మారింది.
ఉస్మానియా యూనివర్సిటీ: ఎందరికో విజ్ఞానాన్ని అందించిన ఓయూ క్యాంపస్‌లోని యూనివర్సిటీ ప్రధాన లైబ్రరీ మసకబారుతోంది. అధికారులు, ఉద్యోగులు, విద్యార్థుల నిర్లక్ష్యం కారణంగా సమస్యలకు నిలయంగా మారింది. లైబ్రరీలో అపరిశుబ్రత తాండవిస్తోంది. మరుగుదొడ్లు దుర్గంధం వెదజల్లుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
కొత్త పుస్తకాల ఊసేలేదు
ఓయూ లైబ్రరీలో కొత్త పుస్తకాల కొనుగోలుకు యూనివర్సిటీ నుంచి ఏటా రూ.30 లక్షలు, యూజీసీ నుంచి రూ.25 లక్షల నిధులను కేటాయిస్తారు. ఈ నిధులతో యూనివర్సిటీ లైబ్రరీతో పాటు ఓయూలోని 20 విభాగాలకు కొత్త పుస్తకాలను కొనుగోలు చేసి పంపిణీ చేయాల్సి ఉంది. ఇందుకు సంబందించి ఆయా విభాగాల అధిపతులు రికమండ్ లేటర్స్ పంపాలని యూనివర్సిటీ లైబ్రరీయన్ ఎన్ని సార్లు కోరినా వారు స్పదించకపోవంతో పుస్తకాలను కొనుగోలు చేయడం లేదు.
దీంతో నిధులు వెనక్కు వెళుతున్నాయి. దీనికితోడు పీజీ కోర్సుల విద్యార్థులు కేవలం తెలుగు మీడియం పుస్తకాలు మాత్రమే చదువుతున్నట్లు మాజీ లైబ్రేరియన్ డాక్టర్ యాదగిరి తెలిపారు. పీహెచ్‌డీ విద్యార్థులు పది శాతం మంది మాత్రమే లైబ్రరీ సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారని ఆయన వివరించారు.
పూర్వ విద్యార్థులే అధికం
యూనివర్సిటీ లైబ్రరీకి ప్రతి రోజు వందల సంఖ్యలో విద్యార్థులు వస్తున్నా వారిలో పూర్వ విద్యార్థులు, నాన్ బోర్డర్లు ఎక్కువగా ఉంటున్నారు. దీనికితోడు కొందరు తప్పుడు గుర్తింపు కార్డుల ద్వారా లైబ్రరీ మెంబర్‌షిప్ తీసుకొని రెగ్యులర్ విద్యార్థులుగా చెలామణి అవుతున్నారు. నూతన వీసీ వర్సిటీ లైబ్రరీని గాడిలో పెట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.