బద్వేలు అర్బన్: ఆర్థిక, రాజకీయ చైతన్యం పునాదిగా కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ డివిజన్ అధ్యక్షులు జి.చంద్రశేఖర్ అన్నారు. శనివారం స్థానిక సుందరయ్య భవనంలో నిర్వహించిన యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డివిజన్ రెండవ మహాసభలలో ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గంపై ప్రభుత్వం, పోలీసులు ఒక వైపు , కిరాయి గుండాలు మరోవైపు అణచివేతకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సకల సంపదలకు సృష్టికర్తలైన కార్మికులు తమ హక్కుల సాధన కోసం పోరాడాలన్నారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాసులు మాట్లాడుతూ సాంకేతిక నైపుణ్యం పేరుతో ఉద్యోగ అవకాశాలు కుదిస్తున్నారని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయడంతోపాటు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మైదుకూరు డివిజన్ కార్యదర్శి సురేష్‌బాబు, బద్వేలు, పోరుమామిళ్ల సబ్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, పిసి.కొండయ్య, నాగేశ్వర్‌రెడ్డి, మాబు, వివిధ మండలాల యూనియన్ నేతలు పాల్గొన్నారు.