- ఆర్‌ఎంపీపై కేసు నమోదు
- పరారీలో డాక్టర్
ఇంజెక్షన్ వికటించి యువకుడి మృతి
Published Sun, Oct 9 2016 11:56 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM
నాగోలు: ఇంజెక్షన్, మాత్రలు వికటించడంతో ఓ బైక్ మెకానిక్ మృతి చెందాడు. ఈ సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. నాగోలు జైపురికాలనీకి చెందిన వంట శివ (18) నాగోలులో బైకు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఐదు రోజుల క్రితం శివకు జ్వరం రావడంతో హనుమాన్‌నగర్‌లోని ఆర్‌ఎంపీ శంకర్ వద్దకు వెళ్లాడు. శంకర్ నాలుగు నెలలుగా ఇంట్లోనే క్లినిక్‌ఏర్పాటు చేసి స్థానికులకు వైద్యం చేస్తున్నాడు. మొదటిరోజు శివకు రెండు ఇంజెక్షన్‌లు ఇచ్చాడు. అయినా జ్వరం తగ్గకపోగా చేతులు, కాళ్లు లాగడంతో శివ మరోసారి శనివారం ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లాడు. మరోసారి రెండు ఇంజెక్షన్‌లు ఇవ్వడంతో శివ ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించింది. దీంతో శివను నాగోలులోని శ్రీలక్ష్మీ నరసింహ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మెరుగైన చికిత్స కోసం కామినేనికి తరలించాలని చెప్పడంతో కామినేనిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శివ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. ఆర్‌ఎంపీ డాక్టర్ శంకర్ నిర్లక్ష్యం వల్లే శివ మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు అతని ఇంటి ముందు ఆందోళనకు దిగారు. అప్పటికే ఆర్‌ఎంపీ డాక్టర్ శంకర్ పరారయ్యాడు. మృతుడి తండ్రి కొమరయ్య ఫిర్యాదు ఈ మేరకు ఎల్‌బీనగర్ పోలీసులు శంకర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పది రోజుల క్రితం ఇదే కాలనీలో నకిలీ డాక్టర్ మూర్తి ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి యాదగిరి అనే వ్యక్తి మృతి చెందగా తాజాగా ఇంజెక్షన్ వికటించి యువకుడు మృతి చెందడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. ఇప్పటికైనా పైస్థాయి అధికారులు స్పందించి నకిలీ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Advertisement
Advertisement