చావైనా.. బతుకైనా అతడితోనే..
► భర్త ఇంటి ముందు యువతి మౌనపోరాటం
► విజయవాడ నుంచి వచ్చి ఆందోళనకు దిగిన దివ్యాంగురాలు
► బాధితురాలికి అండగా నిలిచిన మిగిలిన దివ్యాంగులు
దర్శి : పెళ్లి చేసుకుని కొంతకాలం కాపురం చేశాక భర్త పట్టించుకోక పోవడంతో ఓ యువతి తీవ్ర ఆవైదనకు గురై తన అత్తగారి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. వివరాలు.. విజయవాడ భవానీపురానికి చెందిన నర్రా మాధ వి మూడేళ్ల క్రితం మండల పరిధిలోని తూర్పుచౌటపాలెంలోని బంధువుల వివాహానికి వచ్చింది. అక్కడ మరో సామాజిక వర్గానికి చెందిన కుడి మెల చంద్రబాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పట్లో చంద్రబాబు విశాఖపట్నంలో చదువుతున్నాడు. 2013 మే 19వ తేదీన ఇద్దరూ ఇంట్లో చెప్పకుండా విజయవాడ సమీపంలోని గుణదలలో వివాహం చేసుకున్నారు. పెళ్లి విషయాన్ని చంద్రబాబు చాలాకాలం వరకు తన కుటుంబ సభ్యులకు చెప్పలేదు.
విశాఖపట్నంలో చదువుకుంటూ పది రోజులకు ఒకసారి విజయవాడలోని తన భార్య మాధవి ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. ఆమెను మూడుసార్లు గర్భిణిని చేసి అబార్షన్ కూడా చేయించాడు. పెళ్లి విషయం ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని, ఉద్యోగం వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్తానని భార్యను నమ్మించాడు. రెండేళ్ల అనంతరం విషయం చంద్రబాబు ఇంట్లో తెలిసింది. కుమారునికి మరో సంబంధం చూస్తున్నారు. అప్పటి నుంచి మాధవితో ఆమె భర్త సరిగా మాట్లాడటం లేదు. ఆమె ఫిర్యాదు మేరకు 2015 అక్టోబర్ 31వ తేదీన దర్శి పోలీసుస్టేషన్‌లో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి కాపురానికి పంపారు. విజయవాడలో వేరు కాపురం కూడా పెట్టారు.
మళ్లీ కుక్కతోక వంకరే
మూడు నెలల కాపురం అనంతరం మళ్లీ భార్యను వదిలి ఇంటికి వచ్చేశాడు. భార్యతో ఫోన్‌లో కూడా మాట్లాడేందుకు నిరాకరించాడు. బుధవారం రాత్రి బాధితురాలు తన భర్త చంద్రబాబు ఇంటికి వెళ్లింది. భార్యను ఇంట్లోకి కూడా రానివ్వకుండా బయట గేటు వేశారు. రాత్రంతా ఇంటి బయటే మెట్లపై కూర్చొంది. బాధితురాలికి వీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆనాల సురేష్, జిల్లా అధ్యక్షుడు దుర్గారావు, జాతీయ వర్కింగ్ అధ్యక్షురాలు కొల్లి మాధవీలత మద్దతుగా నిలిచారు.
దివ్యాంగురాలిని వేధించడం అన్యాయం
బాధితురాలికి అండగా నిలిచిన వీహెచ్‌పీఎస్ నేతలు విలేకరులతో మాట్లాడారు. దివ్యాంగురాలిని కించపరిచి మోసం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మాధవికి న్యాయం చేయాల్సిందేనని కోరారు. తన భర్త వచ్చే వరకూ ఇక్కడే కూర్చొంటానని బాధితురాలు తేల్చి చెప్తోంది. గ్రామస్తులు సంఘటన స్థలానికి వచ్చారు. బాధితురాలు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వనట్లు తెలిసింది.