
దీక్ష ప్రారంభించిన వైఎస్ జగన్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరహార దీక్షను ప్రారంభించారు. అశేష ప్రజానీకంతో కిక్కిరిసిపోయిన సభా ప్రాంగణానికి మధ్యాహ్నం చేరుకున్న ఆయన దీక్ష వేదికపై వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి మధ్యాహ్నం 2.25గంటలకు దీక్ష ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే ప్రాణాలర్పించిన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రజలకు అభివాదం చేశారు.
ఈ సందర్భంగా జై జగన్ అంటూ సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ గుంటూరులో నిరవధిక నిరాహార దీక్షను తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రోడ్డు మార్గం ద్వారా బయలు దేరి 12 గంటల ప్రాంతంలో విజయవాడకు చేరుకున్నారు. వెంటనే, కనకదుర్గ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. దర్శనం అనంతరం గుంటూరు దీక్షా స్థలికి బయలుదేరి మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో దీక్షా స్థలికి చేరుకుని దీక్ష ప్రారంభించారు.