
నారాయణ రెవెన్యూ మంత్రి కూడానా?
మంగళగిరి: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రంలో పరిపాలన కరువైందని, దోపిడి మాత్రమే కొనసాగుతుందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే)ధ్వజమెత్తారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసిన సీఎం చంద్రబాబు.. మంత్రి నారాయణ ఒక్కరికే రాజధాని బాధ్యతలు అప్పగించారని, జిల్లాకు చెందిన మంత్రులను సైతం పక్కనపెట్టి తమ దోపిడికి సహకరించేవారినే దరికి చేర్చుకుంటున్నారని దుయ్యబట్టారు.
మునిసిపల్ మంత్రిగా వున్న నారాయణ అది మరిచి రెవెన్యూ మంత్రిగా సర్వం ఆయనే అన్నట్లు వ్యవహరిస్తుండగా అసలు రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి ఇప్పటి వరకు రాజధాని ప్రాంతంలో ఒక్కసారి పర్యటించి రైతుల కష్టాలు తెలుసుకున్నాడా? అంటూ ఆగ్రహవ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో రైతుకూలీలు,రైతులు, కౌలురైతులును పట్టించుకోవడం లేదన్నారు. అసైన్డ్‌భూములు తేలకపోగా భూములిచ్చిన రైతులకు భూముల కేటాయించకపోగా ఆభూములలో ఉద్యోగులకు ఇళ్ళుకట్టిస్తామని చెప్పడం దారుణమని విమర్శించారు.
టీడీపీ పాలన ఎలా వుందంటే పార్టీ సృష్టికర్త ఎన్టీఆర్‌ను మరచి సర్వం నారాయణార్పణంగా మారిందని వ్యాఖ్యానించారు. ఓటు నోటు కేసులో నిందితులుగా ఫోర్‌నిక్స్‌ల్యాబ్ నిర్ధారించినా ముఖ్యమంత్రిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడానికి కారణం తెలంగాణ ప్రభుత్వంతో చంద్రబాబు ఏ చీకటిఒప్పందాలు చేసుకున్నారని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రమంత్రి సుజనాచౌదరి ఒక ప్రకటన చేస్తే పక్కనే వున్న చంద్రబాబు మరొకప్రకటన చేస్తూ రాష్ట్రప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని విమర్శించారు.
మంత్రులను స్టార్‌హోటళ్ళలో వుండొద్దని చెప్పిన ముఖ్యమంత్రి తాను మాత్రం ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ దుబారా చేయడంతో పాటు వాస్తు పిచ్చితో ప్రభుత్వభవనాలును మరమ్మత్తుల పేరుతో కోట్ల రూపాయలు వృధా చేయడాన్ని నిషేదిస్తే ప్రజలకు ఉపయోగకరంగా వుంటుందన్నారు. అంతేకాక విజయవాడలో క్యాంప్ కార్యాలయానికి కోట్ల రూపాయలతో రీమోడలింగ్ చేయటమేకాక,దానికి కూతవేటు దూరంలో వున్న ఉండవల్లి కరకట్టపై విహారవిడిది కొరకు అక్రమ నిర్మాణాలను,సక్రమనిర్మాణాలు చేసిన ఘనతతో పాటు విహారవిడిది భవనాలుకు కోట్లరూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు.