
దండు కదిలింది
► వైఎస్సార్ సీపీ ప్లీనరీకి తరలిన నేతలు
► భూ కుంభకోణాలు, ఉత్తరాంధ్ర వెనుకబాటుపై చర్చ
► జిల్లాకు చెందిన పలు అంశాలపై తీర్మానాలు చేసే అవకాశం
సాక్షి, విశాఖపట్నం: దండు కదిలింది.. అమరావతి వైపు అడుగులు వేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ జాతీయ ప్లీనరీలో భాగస్వామం అయ్యేందుకు జిల్లా నలుమూలల నుంచి పార్టీ నేతలు, శ్రేణులు శుక్రవారం బయలుదేరారు. ప్లీనరీకి ఆహ్వానితులుగా పాసులందుకున్న 2,600 మంది ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు. మరో పక్క ప్లీనరీలో పాల్గొనాలన్న ఉత్సుకతతో పాస్‌లు లేనప్పటికీ.. వేలాది మంది పయనమయ్యారు.
గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ వద్ద శని, ఆదివారం జరగనున్న జాతీయ ప్లీనరీకి జిల్లా పార్టీ నాయకత్వం తరలివెళ్లింది. ఏర్పాట్లకు సంబంధించిన కమిటీల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌తో పాటు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, బూడి ముత్యాలనాయుడులను నియమించడంతో వారు శుక్రవారం ఉదయమే బయలుదేరి వెళ్లారు. సాయంత్రం సమన్వయకర్తల ఆధ్వర్యంలో నియోజకవర్గల వారీగా పార్టీ బాధ్యులంతా తరలివెళ్లారు. సింహాచలంలో పార్టీ భీమిలి పట్టణ అ«ధ్యక్షుడు అక్కరమాని వెంకటరావు పూజలు చేసి కార్యకర్తలతో ప్లీనరీకి పయన మయ్యారు.
రాష్ట్ర రాజధానిలో తొలిసారిగా జరుగుతున్న జాతీయ ప్లీనరీలో ఈసారి ప్రధానంగా విశాఖ, ఉత్తరాంధ్ర సమస్యలపై ఎక్కువగా చర్చ జరిగే అవకాశాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన విశాఖ భూ కుంభకోణంపై పార్టీ చేస్తున్న పోరాటం.. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ప్లీనరీలో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై తీర్మానం చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. ఈ కుంభకోణం వెనుక అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నందున సిట్ విచారణను తక్షణమే నిలిపివేసి సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్లీనరీ ద్వారా కేంద్రాన్ని డిమాండ్ చేయనున్నట్టు చెప్పారు. ఇటీవల జరిగిన జిల్లా ప్లీనరీలో చేసిన తీర్మానాలపై కూడా జాతీయ ప్లీనరీలో ప్రత్యేక చర్చ జరుగుతుందన్నారు. ప్రత్యేక హోదాతో పాటు విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ సాధన కోసం పార్టీ మలిదశ ఉద్యమంపై తీర్మానం చేయనున్నట్టు చెప్పారు.
విభజన హామీలు, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకుండా మొండిచేయి చూపుతున్న వైనంపై చర్చించనున్నారు. జీవీఎంసీ ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని, మహానేత వైఎస్సార్ కలల ప్రాజెక్టు ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేయాలని, సింహాచలం, గాజువాక భూ సమస్యలను పరిష్కరించాలని, ఏజెన్సీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని, బాక్సైట్ మైనింగ్ తవ్వకాల కోసం ఇచ్చిన జీవో నం.97ను తక్షణమే రద్దు చేసే అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్టు గుడివాడ తెలిపారు.