అనవసర వివాదం | Aligarh Muslim University Muhammad Ali Jinnah Photo Issue | Sakshi
Sakshi News home page

అనవసర వివాదం

Published Sat, May 5 2018 1:17 AM | Last Updated on Sat, May 5 2018 1:17 AM

Aligarh Muslim University Muhammad Ali Jinnah Photo Issue - Sakshi

అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)

ఒక చిత్రపటం చుట్టూ అల్లుకున్న వివాదం ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)ని అట్టుడికిస్తోంది. సరిగ్గా ఏడు దశాబ్దాలక్రితం మరణించిన పాకిస్తాన్‌ జాతిపిత మహమ్మదాలీ జిన్నా చిత్రపటం ఆ యూనివర్సిటీ విద్యార్థి సంఘం కార్యాలయంలో ఉండొచ్చా లేదా అనే అంశంపై ఈ వివాదం రేకె త్తింది. ఆయన చిత్రపటంపై విద్యార్థుల్లో విభేదాలు తలెత్తితే అర్ధం చేసుకోవచ్చు. దాన్ని చక్కదిద్దడానికి యూనివర్సిటీ అధికారులు తమ వంతు ప్రయత్నం చేస్తారు. హద్దులుదాటి ప్రవర్తించిన విద్యార్థులపై చర్యలు తీసుకుంటారు. కానీ జిన్నా చిత్రపటంపై అభ్యంతరం లేవనెత్తినవారు స్థానిక బీజేపీ ఎంపీ సతీష్‌ గౌతమ్‌. దేశ విభజనకు కారకుడైన వ్యక్తి చిత్రపటం ఈ విశ్వవిద్యాలయంలో ఎలా ఉంచుతా రంటూ వైస్‌ చాన్సలర్‌కు ఆయనొక లేఖ రాశారు. తక్షణం తొలగించాలంటూ డిమాండ్‌ చేశారు. అలా లేఖ రాసిన మూడు రోజులకు హిందూ యువవాహిని కార్యకర్తలు ప్రాంగణంలోకి చొరబడ్డారు.

వారిని విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడి పోలీసులు లాఠీచార్జి, రబ్బర్‌ బుల్లెట్లు ప్రయోగించారు. 1875లో ఒక కళాశాలగా ప్రారంభమై, 1920 కల్లా విశ్వవిద్యాల యంగా మారిన ఏఎంయూకి పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. ఇతర విశ్వవిద్యాలయాల తరహాలోనే అది కూడా మనుగడ కోసం, ఉన్నత ప్రమా ణాలను అందుకోవడం కోసం ఎన్నో అవరోధాలను అధిగమించాల్సి ఉంది. అన్ని విశ్వవిద్యాలయాలూ ఎదుర్కొంటున్న అధ్యాపకుల కొరత ఏఎంయూకి కూడా ఉంది. ఇవి చాలవన్నట్టు మైనారిటీ విద్యా సంస్థ ప్రతిపత్తిని కోల్పోవడంతో రెండేళ్ల నుంచి దానికి ఆర్థిక ఇబ్బందులు కూడా మొదలయ్యాయి. ప్రాంగణంలో కట్టుబాట్ల పేరుతో అమలయ్యే ఆంక్షలు ఆమధ్య పెను వివాదాన్ని తెచ్చాయి. అక్కడ మంచి గ్రంథాలయం ఉన్నా విద్యార్థినులకు అందులో ప్రవేశం ఉండేది కాదు.

దశాబ్దాల నుంచి అమలవుతున్న ఈ వివక్షపై 2014లో విద్యార్థినులు తిరగబడ్డారు.  అమ్మా యిల్ని అనుమతిస్తే అక్కడికొచ్చే అబ్బాయిల సంఖ్య నాలుగు రెట్లు పెరుగుతుం దని, దాంతో చోటు సమస్య తలెత్తుతుందని, ‘క్రమశిక్షణ’ దెబ్బతింటుందని వైస్‌ చాన్సలర్‌ చేసిన ప్రకటన అందరినీ దిగ్భ్రమపరిచింది. లింగ వివక్ష పాటించడం తగదని అలహాబాద్‌ హైకోర్టు చీవాట్లు పెట్టడంతో అధికారులు దారి కొచ్చారు. ఇలా విద్యా సంబంధ విషయాలపై, అధ్యాపకుల కొరతపై, సదు పాయాల లేమిపై ఆందోళనలు తలెత్తితే అర్థం చేసుకోవచ్చు. కానీ ఎన్నడో 1938లో పెట్టిన జిన్నా చిత్రపటం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువు కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

జిన్నాపై బీజేపీకి ఉన్న ఏవగింపులో దాపరికమేమీ లేదు. కానీ ఆ విషయంలో ఆ పార్టీ కీలక నేతలే గతంలో తీవ్రంగా విభేదించారు. 2005లో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్‌ కే అద్వానీ పాకిస్తాన్‌ సందర్శించి జిన్నా సమాధి వద్ద నివాళులర్పించ డంతోపాటు ఆయన్ను సెక్యులర్‌ నేతగా కొనియాడారు. చరిత్రపై చెరగని ముద్ర వేసిన అరుదైన నేతల్లో ఆయనొకరని కీర్తించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అద్వానీ పార్టీ అధ్యక్ష పదవి పోయింది. అయితే 2009లో ప్రధాని అభ్యర్థిగా ఆయన్ను నిర్ణ యించడానికి, 2014లో ఎంపీగా అవకాశమివ్వడానికి ఆ వ్యాఖ్యలు అడ్డురాలేదు. మరో సీనియర్‌ నేత జశ్వంత్‌ సింగ్‌ కూడా జిన్నాను కీర్తించారు. కాంగ్రెస్, నెహ్రూలు ఆయన్నొక భూతంగా చూపారని 2009లో వెలువరించిన గ్రంథంలో ఆరోపిం చారు. జశ్వంత్‌ను వెనువెంటనే పార్టీ నుంచి బయటకు పంపేసినా, మరో ఏడాదికి తిరిగి చేర్చుకున్నారు. 2012లో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు.

2014 వరకూ పార్టీ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు వివాదం రేకెత్తడానికి కారకుడైన బీజేపీ ఎంపీ సతీష్‌ గౌతమ్‌ తీరును ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లోని మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య ప్రశ్నించారు. జిన్నా మహోన్నతుడని ప్రశంసిం చారు. తమ పార్టీ నేతల్లోనే ఇలా వేర్వేరు అభిప్రాయాలు పెట్టుకుని విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం కార్యాలయం మాత్రం జిన్నా చిత్రపటం పెట్టుకోరాదని ఎంపీ హుకుం జారీ చేయడం, దాన్ని అమలు చేయలేదని బయటి వ్యక్తులను దాడికి పంపడం ఆశ్చర్యకరం. జిన్నా మితవాద రాజకీయాలతో, దేశ విభజనకు కార ణమైన ఆయన సిద్ధాంతంతో ఎవరూ ఏకీభవించరు. అంతమాత్రాన స్వాతంత్య్ర సమరంలో, కాంగ్రెస్‌లో ఆయన పాత్రను విస్మరించలేం. ఆ సమరంలో పాలుపం చుకున్న నేతలు, ప్రముఖులు విశ్వవిద్యాలయాన్ని సందర్శించినప్పుడు విద్యార్థి సంఘంలో వారికి జీవితకాల సభ్యత్వాన్నిచ్చి, వారి చిత్రపటాన్ని కార్యాలయంలో ఉంచడం ఆనవాయితీ. అలా 1938లో జిన్నా చిత్రపటం అక్కడ చేరింది. సరోజినీ నాయుడు, రాజగోపాలాచారి, డాక్టర్‌ సీవీ రామన్, బ్రిటన్‌ రచయిత ఈ ఎమ్‌ ఫార స్టర్‌ తదితరుల చిత్రపటాలు కూడా అక్కడున్నాయి. పైగా 1938 నాటికి జిన్నా దేశ విభజన కోరలేదు.

రెండు దేశాలుగా విడిపోయి ఉండొచ్చుగానీ మన చరిత్రతో, సంప్రదాయంతో ముడిపడ్డ అనేక ప్రదేశాలు పాకిస్తాన్‌లో ఉన్నాయి. అక్కడి తక్షశిలలోనే చాణక్యుడు అర్థశాస్త్రాన్ని రాశాడు. సంస్కృత వ్యాకరణకర్త పాణిని తన ప్రస్థానాన్ని ప్రారం భించింది తక్షశిలలోనే. ఆయుర్వేదానికి ఆద్యుడనదగ్గ చరకుడు అక్కడి వాడే. మహాభారతంలో ప్రస్తావనకొచ్చే ప్రదేశాలు, బౌద్ధానికి సంబంధించిన అనేక చారి త్రక విశేషాలు పాక్‌లో ఉన్నాయి. విప్లవవీరుడు భగత్‌సింగ్‌ భారత్, పాకిస్తాన్‌ల ఉమ్మడి హీరో అని పాక్‌లోని పంజాబ్‌ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. చరిత్ర మనం కోరుకున్నటు ఉండదు. అందులో మంచిని స్వీకరించి, విషాదకర ఘట్టాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని మున్ముందుకెళ్లడమే మనం చేయగలిగే పని. జిన్నాపై మనకెలాంటి అభిప్రాయాలున్నా ఆయనలోని అనుకూలాంశాలు, ప్రతికూ లాంశాలు చర్చించుకోగలం తప్ప వాటిని తుడిచేయడం సాధ్యపడదు. విశ్వవిద్యాల యాలకు, ప్రత్యేకించి ఏఎంయూకు ఎన్నో సమస్యలుండగా పాలకపక్షంగా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయడానికి బదులు అనవసర వివాదాలను రేకెత్తించడం బీజేపీకి తగని పని. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement