ఇదేమి న్యాయం?! | bail to rape convict to settle the matter vith victim | Sakshi
Sakshi News home page

ఇదేమి న్యాయం?!

Published Sat, Jun 27 2015 12:23 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM

ఇదేమి న్యాయం?! - Sakshi

ఇదేమి న్యాయం?!

మహిళలపై జరిగే నేరాల విషయంలో సమాజం అవసరమైన సున్నితత్వాన్ని ప్రదర్శించడంలేదని ఆవేదన చెందేవారికి ఇటీవల మద్రాస్ హైకోర్టు తీసుకున్న ఒక నిర్ణయం దిగ్భ్రాంతి కలిగించింది. మైనారిటీ తీరని బాలికపై 2009లో అత్యాచారం చేసిన నిందితుడికి కింది కోర్టు ఏడేళ్ల శిక్ష విధిస్తే...అతని అప్పీలును స్వీకరించిన హైకోర్టు ఆ యువకుడికి తాత్కాలిక బెయిల్ మంజూరుచేసి బాధితురాలితో రాజీ చేసుకోవడానికి వీలుగా కేసును ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదిక(ఏడీఆర్) కు పంపింది.

మహిళలపై సాగే నేరాల్లో అత్యాచారం అనేది అత్యంత దుర్మార్గమైన హింస. అది ఆమె శరీరంపై జరిగే దాడి మాత్రమే కాదు... మానసిక హింస కూడా. బాధితురాలు బాలిక అయితే ఈ హింస మరిన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది. సకాలంలో సరైన వైద్య సాయం అందని పక్షంలో తదనంతర జీవితంపై దాని ప్రభావం అపారంగా ఉంటుంది. ఆడవాళ్లపై సాగుతున్న హింస సమాజంలో ఉండే ఆధిపత్య సంస్కృతి పర్యవసానమే. ఈ సమస్యను సరిగా అర్థం చేసుకోనందువల్లే మన నేతలు బాధ్యతారహితంగా మాట్లాడి... చీవాట్లు తిన్నాక క్షమాపణలు చెప్పు కోవాల్సివస్తున్నది. కనీసం న్యాయస్థానాలైనా కఠినంగా ఉండి, నేరగాళ్లకు త్వరిత గతిన శిక్షలు పడేలా చూస్తే ఇలాంటి నేరాలు అదుపులోనికి వస్తాయనుకుంటే అదీ ఆశించిన స్థాయిలో జరగటంలేదు.

తమ ముందు విచారణకొచ్చే కేసుల విషయంలో న్యాయస్థానాలు సృజనాత్మ కంగా ఆలోచించడం, చొరవ ప్రదర్శించడం మంచిదే. కానీ, అది బాధితులకు మేలు జరిగేలా ఉండటం అవసరం. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. దేవదాస్ తీసుకున్న నిర్ణయాన్ని కొందరు ‘మానవతా దృక్పథం’తో ఆలోచించి చేసిన మంచి పనిగా భావిస్తున్నారు. అత్యాచారానికి గురైన యువతిని సమాజం ఎన్నటికీ ‘సాధా రణ అవివాహిత’గా గుర్తించదని, నేరగాడికి శిక్ష పడినా అది ఆమె జీవితంలో ఎలాంటి మార్పునూ తీసుకురాలేదని వాదిస్తున్నారు. ఈ కేసులో అయితే బాలిక ఒక శిశువుకు జన్మనిచ్చింది గనుక ఆమె పరిస్థితి మరింత దుర్భరంగా ఉంటుందని చెబుతున్నారు. ఇవన్నీ ఆలోచించడంవల్లే న్యాయమూర్తి మానవతా దృక్పథంతో ఒక పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేశారన్నది వారి జవాబు.

ఇతరత్రా అంశాలన్నిటినీ పక్కన బెట్టి చట్టపరంగా ఆలోచించినా అత్యాచారం కేసు రాజీకి వీలులేని నేరం. ఈ విషయంలో రెండేళ్లక్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉంది. అత్యాచారం, హత్య వంటి తీవ్రమైన నేరాల్లో కక్షిదారులు రాజీపడటానికి అవకాశమిస్తే ఆచరణలో అది బాధితులను మరింత ఇబ్బంది పెట్టే చర్య అవుతుందని చెప్పింది. అవతలిపక్షం ఒత్తిళ్లు తీసుకురావడంవల్ల కావొచ్చు... లేదా ఆ ఘటన కలిగించే మానసిక క్షోభ పర్య వసానంగా ఏర్పడ్డ నిస్సహాయస్థితివల్ల కావొచ్చు- బాధితులు రాజీకి సిద్ధపడవచ్చు ననీ, వారిని అలాంటి వాతావరణంలోకి నెట్టడం సమంజసం కాదనీ తెలిపింది.

సామాజికంగా చూసినా ఈ తరహా కేసుల్లో రాజీలు అలాంటి నేరాలకు ఒడిగట్టే వారిలో ధీమా పెంచుతాయి. ఏదోరకంగా బాధితురాలిని లొంగదీసుకోవచ్చునన్న భరోసా ఏర్పడుతుంది. నిజానికి మహిళా సంఘాలు, పౌర సమాజం కార్యకర్తల సుదీర్ఘ ఆందోళన పర్యవసానంగా అత్యాచారం ఉదంతాలను సమాజానికి వ్యతి రేకంగా జరిగే నేరంగా నిర్భయ చట్టంలో పరిగణించారు. ఈమేరకు భారతీయ శిక్షాస్మృతి నిబంధనను మార్చారు. ఈ కేసులో బాధితురాలు అనాథ బాలిక. తన శిశువును పోషించడంపైనా, సమాజంలో మనుగడ సాగించడంపైనా ఆమెకూ ఆందోళన ఉంది. అంతమాత్రాన ఆమె నేరగాడితో రాజీపడటానికి సిద్ధంగా లేదు. అతన్ని పెళ్లాడటానికి అసలే ఒప్పుకోవడం లేదు. తనపై నేరానికి పాల్పడినవాడితో రాజీ ఏమిటని నిశ్చయంగా అడుగుతున్నది.

‘అతన్ని చూడటమే అసహ్యమనిపి స్తోంది... అలాంటివాడికి భార్యగా ఉండటమా’ అని అంటున్నది. ఈ వివేచన న్యాయస్థానానికి లేకపోవడమే బాధాకరమైన విషయం. బాధితురాలి భవిష్యత్తుపై ఆదుర్దా ఉండటం మంచిదే అయినా అది ఆమెకు ఒక మంచి జీవితాన్ని ప్రసా దించేలా ఉండాలి. నేరగాడికి విధించిన జరిమానా రూ. 2 లక్షలు ఆమెకు లభిం చేలా చూడటంతోపాటు ప్రభుత్వంవైపుగా స్థిరమైన ఉపాధి, పరిహారం దక్కేలా చూస్తే తన కాళ్లపై తాను నిలబడగలుగుతుంది. అలాంటి స్వతంత్రత ఆమెకు ఆత్మ విశ్వాసాన్నిస్తుంది. అది ఆమె జీవితాన్ని మలుపుతిప్పుతుంది. ఇందుకు భిన్నంగా ఆ నేరస్తుడితో వివాహానికి వీలు కల్పిస్తే ఇకపై ఆ నేరం చేయడం తన హక్కుగా భావిస్తాడు.

వైవాహిక జీవితంలో జరిగే అత్యాచారాల విషయంలో చట్టం తీసుకు రావడం ఇక్కడ అమల్లో ఉన్న సంప్రదాయాలూ, సంస్కృతి కారణంగా సాధ్యం కాదని ఈమధ్యే కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది గనుక అతన్ని ఇక ఏ చట్టాలూ ఏమీ చేయలేవు. ఆ యువతి జీవితాంతం నోరెత్తకుండా భరించాలి. ఎదురుతిరిగితే ‘సంప్రదాయాన్ని’ ధిక్కరించినట్టవుతుంది. ఈ  కేసును ఏడీఆర్‌కు పంపితే జరిగిన నేరాన్ని ఒక ప్రైవేటు వివాదంగా పరిగణించినట్టవుతుందని కూడా న్యాయ స్థానానికి తోచకపోవడం విచిత్రం.

ఢిల్లీలో నిర్భయ ఉదంతం, దానిపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనల తర్వా త కఠినమైన శిక్షలుండేలా చట్టం వచ్చింది. ఆ నిరసనలు తీసుకొచ్చిన చైతన్యంవల్ల కావొచ్చు... అత్యాచారాలకు సంబంధించిన కేసులు వెలుగులోకి రావడం ఎక్కు వైంది. 2011తో పోలిస్తే 2012లో అత్యాచారం కేసుల సంఖ్య 3 శాతం పెరిగితే... 2012 నుంచి 2013కు ఈ పెరుగుదల ఒక్కసారిగా 35 శాతం ఎక్కువైంది. కానీ శిక్ష విధింపు మాత్రం ఆశాజనకంగా లేదు. 2011లో విచారణ పూర్తయి శిక్షలు విధించిన కేసుల శాతం 26.4 ఉంటే... 2012లో అది 24.2 శాతానికి తగ్గి, 2013లో 27.1 శాతంగా ఉంది. అంటే ఈ మూడేళ్లలో సగటున 26 శాతం కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి.

నేషనల్ క్రైం రికార్డు బ్యూరో గణాంకాల ప్రకారం దేశంలో రోజూ అత్యా చారం కేసులు 75 నమోదవుతున్నాయి. 2013 నాటికి వివిధ కోర్టుల్లో 95,731 అత్యాచారం కేసులు పెండింగ్‌లో ఉంటే 12,736 కేసుల్లో శిక్షలు పడ్డాయి. ఇవన్నీ సమస్య తీవ్రతనూ, సరిదిద్దుకోవాల్సిన లోపాలనూ తెలియజెబుతాయి. ఈ విషయంలో చర్యలు తీసుకుంటున్నా పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. సత్వరం శిక్షపడితేనే అత్యాచారాలు అదుపులోకొస్తాయి తప్ప ఇలాంటి ‘రాజీ పెళ్లిళ్ల’వల్ల కాదని అందరూ గుర్తిస్తే మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement