‘మినీ సార్వత్రిక సమరం’గా అందరూ భావించిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటర్లు అంచనాలకు అనుగుణమైన తీర్పే ఇచ్చారు. అస్సాంలో అధికార పీఠం చేజిక్కించుకోవడం ద్వారా ఈశాన్య భారతంలో తొలిసారి బీజేపీ విజయబావుటా ఎగరేసింది. ఎన్నికల్లో సర్వసాధారణంగా కనబడే ‘ప్రభుత్వ వ్యతిరేకత’ను అధిగ మించి పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, తమిళనాడులో జయలలిత వరసగా రెండోసారి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. 1984లో ఎంజీఆర్ హయాంలో మినహా ఎప్పుడూ అధికార పార్టీ గెలిచిన దాఖలా లేని తమిళనాట జయలలిత కొత్త చరిత్ర సృష్టించారు.
కేరళలో అలాంటి రికార్డే నెలకొల్పాలని కలలుగన్న కాంగ్రెస్ చతికిలపడింది. మద్య నిషేధంలాంటి మంచి నిర్ణయాలు సైతం కుంభకోణాల్లో చిక్కుకున్న ఆ పార్టీని రక్షించలేకపోయాయి. చిన్న రాష్ట్రమైన పుదుచ్చేరిలో మాత్రమే ఆ పార్టీ పుంజుకోగలిగింది. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో రెండు కీలక రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడంతో అది తప్పనిసరి పరిణామం కావొచ్చునని కాంగ్రెస్‌కు కూడా అర్ధమై ఉండాలి.
అస్సాంలో వరసగా 15 ఏళ్లు అధికారంలో ఉండటంవల్ల ‘ప్రభుత్వ వ్యతిరేకత’ తమను దెబ్బతీసిందని కాంగ్రెస్ నేతలు చేస్తున్న వాదన నిజమే కావొచ్చుగానీ ఈ ఎన్నికల్లో ఆ పార్టీ చేసిన తప్పులు కూడా దాన్ని మరింత పెంచాయని చెప్పాలి. కోటి 20 లక్షలమంది జనాభా ఉన్న ముస్లింలలోని స్థానికులకూ, ‘వలసదారుల’కూ మధ్య ఉండే విభేదాలను అనుకూలంగా మలుచుకోవడంలో బీజేపీ విజయం సాధించింది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మూడు స్థానాలు మాత్రమే వచ్చాక సీఎం తరుణ్ గోగోయ్‌ని మారుస్తారని అందరూ అనుకున్నారు. ఆ పని చేయక పోవడం కాంగ్రెస్‌ను బాగా దెబ్బతీసింది. ఎన్నికల్లో ఏజీపీ, బోడో ఫ్రంట్‌లతో కూటమి కట్టడానికి వచ్చిన అవకాశాలను గోగోయ్ సద్వినియోగం చేసుకోలేక పోయారు. వాటినే మిత్రులుగా చేసుకుని బీజేపీ విజయం సాధించింది. ముస్లిం లలో పలుకుబడి ఉన్న ఏఐయూడీఎఫ్‌నూ గొగోయ్ దరిచేర్చుకోలేకపోయారు. అది ఒంటరిగా పోటీ చేసి కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చగలిగింది.
పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ విజయం ఖాయమని దాదాపు అన్ని సర్వేలూ చెప్పినా మమత బలం తగ్గుతుందని అంచనా వేశాయి. కానీ ఒంటరిగా బరిలోకి దిగి గతంలో కన్నా 24 స్థానాలు పెంచుకుని రాష్ట్రంలో తనకెదురు లేదని మమతా బెనర్జీ నిరూపించుకున్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకొస్తామన్న భ్రమలు లేకపోయినా బలమైన ప్రతిపక్షంగా అవతరిస్తామని వామపక్షాలు ఆశించాయి. భవిష్యత్తులో కాంగ్రెస్‌తో ఎలాంటి అవగాహనా ఉండరాదని తీసుకున్న నిర్ణయాన్ని సైతం అందుకోసం సీపీఎం పక్కనబెట్టింది. కానీ వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు. ఒంటరిగా వచ్చినా, ఎవరితోనైనా కలిసి వచ్చినా లెఫ్ట్ ఫ్రంట్‌ను ఆదరించేది లేదని బెంగాల్ ఓటర్లు తేల్చిచెప్పారు. ఈ పొత్తువల్ల బాగా లాభపడింది కాంగ్రెసే. గత ఎన్నికల్లో తృణమూల్‌తో కలిసి పోటీచేసి 42 స్థానాలు గెల్చుకున్న కాంగ్రెస్... ఈసారి మరో రెండు స్థానాలు అదనంగా సంపాదించుకుంది. మమత ప్రభు త్వంపై ఎంతో కొంత అసంతృప్తి ఉన్నా ఆమెను సవాలు చేయగల గట్టి పక్షం లేదని ఓటర్లు భావించినట్టున్నారు.
‘ప్రతి అయిదేళ్లకూ అధికార మార్పిడి’ అనే సిద్ధాంతానికి ఈసారి తమిళ ఓటర్లు దూరంగా ఉన్నారు. 1984 తర్వాత తొలిసారి వారు అధికార పార్టీనే మళ్లీ అందలం ఎక్కించారు. గతంలో అన్నాడీఎంకేతో కలిసి పోటీచేసి 48 స్థానాలు గెల్చుకున్న సినీ నటుడు విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకే ఈసారి వేరే పార్టీలతో కూటమి కట్టి సున్నాచుట్టింది.
కూటమిలోని ఏ ఒక్క పార్టీ గెలవలేకపోయింది. అయితే ఈ కూటమి వల్ల భారీగా నష్టపోయింది డీఎంకే పార్టీయే. ప్రభుత్వ వ్యతిరేక ఓటును డీఎండీకే కూటమి చీల్చడం, కరుణానిధి వారసత్వం ఎవరిదన్న అంశంలో స్పష్టత నీయకపోవడం, కరుణానిధి కుమారులు ఆళగిరి, స్టాలిన్‌లమధ్య ఉన్న కుమ్ములా టలు డీఎంకేకు ప్రతికూలంగా పనిచేశాయి. రద్దయిన అసెంబ్లీలో ఉన్న 22 స్థానా లతో పోలిస్తే ఈసారి 97 సీట్లు గెల్చుకోవడం ఒక్కటే ఆ పార్టీకి కాస్త ఓదార్పు. ఎన్నికలు ప్రకటించాక జరిపిన సర్వేల్లో అన్నా డీఎంకే మళ్లీ గెలుస్తుందని జోస్యం చెప్పిన సంస్థలు తర్వాత దశలో తడబడ్డాయి. డీఎంకే అధికారంలోకి రావచ్చునని అంచనా వేశాయి. రెండు పార్టీలూ పోటీలు పడి ప్రజలకు వరాలు కురిపించినా చివరకు జయలలితవైపే జనం మొగ్గుచూపారు. చురుగ్గా నిర్ణయాలు తీసుకోవడం, ఎన్ని అడ్డంకులెదురైనా వాటిని అమలు చేయడం వంటి అంశాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి.
కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ‘సౌర తుపాను’లో కొట్టుకు పోయింది. లక్ష కోట్ల నిడివి దాటిన 2జీ స్పెక్ట్రమ్‌లాంటి కుంభకోణాలతో పోలిస్తే రూ. 7 కోట్ల సోలార్ స్కాం చిన్నదే అయినా దానికి ప్రధాన సూత్రధారి అయిన సరితా నాయర్ కథలు కథలుగా వెల్లడించిన లోగుట్లు జనాన్ని దిగ్భ్రమపరిచాయి. నేరుగా ముఖ్యమంత్రి ఊమెన్‌చాందీపైనే ఆరోపణలు రావడం కాంగ్రెస్‌కు గుది బండగా మారింది. దానికితోడు న్యాయశాస్త్ర విద్యార్థినిపై అత్యాచారం జరిపి, ఆమెను అత్యంత దారుణంగా హతమార్చిన ఉదంతం యూడీఎఫ్ పాలనపై ఆగ్ర హావేశాలు కలిగించింది. కనుకనే ఎల్‌డీఎఫ్ సునాయాసంగా 91 స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్రంలో బీజేపీ ఒక స్థానం గెల్చుకోవడం ద్వారా తొలిసారి ఖాతా తెరిచింది. మొత్తానికి ఢిల్లీ, బిహార్ ఎన్నికల్లో చవిచూసిన ఓటమితో దిగాలుగా ఉన్న బీజేపీకి ఈ ఎన్నికలు టానిక్‌లా పనిచేస్తాయి. వచ్చే ఏడాది జరగబోయే యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొనడానికి అవసరమైన జవసత్వాలనిస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల పేరెత్తితే నిలు వెల్లా వణికేది కాంగ్రెస్ మాత్రమే. ఇది ఆ పార్టీ స్వయంకృతం.
విలక్షణమైన తీర్పు
Published Fri, May 20 2016 1:17 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement