'వస్తానొస్తానంటూ' రెండు దశాబ్దాలుగా తన అభిమాన జనసందోహాన్ని ఊరి స్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్టు ఆది వారం ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కొత్త రాజకీయ పార్టీని స్థాపించి తమిళనాడు అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాలకూ అభ్యర్థుల్ని బరిలో దించుతామని కూడా చెప్పారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత 2016 డిసెంబర్‌లో కన్నుమూశాక అక్కడి రాజకీయ యవనికపై వరసబెట్టి కొన సాగుతున్న పరిణామాలను గమనిస్తున్నవారికి సమర్ధులైన నాయకులొస్తే జనంలో ఆదరణ లభిస్తుందన్న అభిప్రాయం కలగడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పటికీ అన్నాడీ ఎంకే పార్టీయే పాలకపక్షంగా ఉన్నా... సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వెనకే మెజారిటీ ఎమ్మెల్యేలున్నా ఆ ప్రభుత్వం దినదినగండంగానే బతుకీడుస్తోంది. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మాత్రమే రాష్ట్రంలో బలమైన, పటిష్ట మైన పార్టీ. అన్నా డీఎంకే దుస్థితి చూస్తూ ఎప్పుడు ఎన్నికలొచ్చినా తమదే అధికా రమని ధీమాతో ఉన్న ఆ పార్టీ మొన్నటి ఆర్‌కే నగర్ ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పో యింది. దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక అది అయోమయంలో పడింది.
సినిమా అనేది ఒక బలమైన, ప్రభావవంతమైన మాధ్యమం కనుక ఆ రంగంలో మన్ననలందుకునేవారికి సహజంగానే జనాకర్షణ ఉంటుంది. ఎక్కడి కెళ్లినా వారిని చూసేందుకు జనం విరగబడతారు. కానీ ఇలాంటివన్నీ రాజకీయ రంగంలో ఆ నటుల అఖండ విజయానికి గ్యారెంటీనివ్వలేవు. వారేం చెబు తున్నారో, ఏం చేస్తున్నారో... వారి పార్టీ ఆశయాలేమిటో, సిద్ధాంతాలేమిటో జనం గమనిస్తారు. తమ రాక వెనకున్న అవసరమేమిటో, అందులోని ఔచిత్యమేమిటో... వర్తమాన రాజకీయాలపైనా, పాలనపైనా తమ అభిప్రాయాలేమిటో ఆ నటులు విస్పష్టంగా వివరించగలగాలి. తమవల్ల మెరుగైన మార్పు సాధ్యమేనన్న అభి ప్రాయం కలిగించగలగాలి. అన్నిటికీమించి అప్పటికి పాలకులుగా ఉంటున్నవారిపై జనంలో అసంతృప్తి ఉండాలి. ఒక నిరాశామయ వాతావరణం అప్పటికే అలు ముకుని ఉండాలి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్వర్గీయ ఎన్టీ రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించేనాటికి కాంగ్రెస్ అన్నివిధాలా భ్రష్టుపట్టి ఉంది. ఆ పార్టీ పాలనపై జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అలాంటి సమయంలో పార్టీని స్థాపించబట్టే ఎన్టీ రామారావు కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే అధికారంలోకి రాగలిగారు. కానీ అనేకానేక సంక్షేమ పథకాలతో, సమర్ధవంతమైన పాలనతో స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుగులేని జనాదరణను పొందుతున్న సమయంలో 2009 ఎన్నికల ముందు ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి చివరి కెలా వైఫల్యం మూటగట్టుకున్నారో అందరూ చూశారు.
తమిళనాడులో సినీ ప్రముఖులు రాజకీయ రంగ ప్రవేశం చేయడం కొత్తగాదు. డీఎంకే స్థాపించి ముఖ్యమంత్రిగా ఎదిగిన అన్నాదురై, ఆయన తర్వాత అధికారం లోకొచ్చిన కరుణానిధి సినీ రంగానికి చెందినవారే. అన్నా డీఎంకే పార్టీని స్థాపించిన సినీ హీరో ఎంజీ రామచంద్రన్ పదేళ్లపాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజకీయా లపై చెరగని ముద్ర వేశారు. ఆయన ఆశీస్సులతో రాజకీయాల్లోకొచ్చిన జయలలిత సైతం రాణించారు. కానీ శివాజీ గణేశన్, విజయ్‌కాంత్, శరత్‌కుమార్‌లాంటివారు విఫలమయ్యారు. పొరుగునున్న కర్ణాటకలో అగ్రశ్రేణి హీరోగా వెలుగొందిన రాజ్ కుమార్‌పై రాజకీయ రంగప్రవేశం చేయమని ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా ఆయన దూరంగానే ఉండిపోయారు. కన్నడ భాషా, సంస్కృతి పరిరక్షణ ఉద్యమాలకే పరి మితమయ్యారు. ఉత్తరాదిలో అమితాబ్‌బచ్చన్ మొదలుకొని అనేకులు రాజ
కీయ రంగ ప్రవేశం చేసినా వారు ఏదో ఒక జాతీయ పార్టీనో, ప్రాంతీయ పార్టీనో ఆశ్రయించి ఎన్నికల్లో గెలుపొందారు తప్ప సొంతంగా పార్టీ పెట్టే సాహసం చేయలేదు.
వర్తమాన తమిళనాడులో రాజకీయ శూన్యత అలుముకున్నదని, మొన్నటి ఆర్‌కే నగర్ ఉప ఎన్నిక ఫలితం దీనినే ప్రతిబింబిస్తున్నదని భావిస్తున్నవారు రజనీకాంత్ ఆగమనానికి ఇదే సరైన సమయమని విశ్వసిస్తున్నారు. బహుశా రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రజనీకాంత్‌కు కూడా అలాంటి అభిప్రాయమే ఉండొచ్చు. అయితే రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉండటం నిజమైనా... దానికదే రజనీకాంత్‌నైనా, మరెవరినైనా అందలం ఎక్కించలేదు. అందులోనూ తమిళనాడు మిగిలిన రాష్ట్రాల్లాంటిది కాదు. స్వాతంత్య్రానికి ముందే అక్కడ వేళ్లూనుకున్న ద్రవిడ ఉద్యమం సామాజిక, సాంస్కృతిక రంగాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ రంగాల్లో ఆ ఉద్యమం సాధించిన ఘన విజయాలను సుస్థిరం చేసుకునేందుకు తొలుత డీకే, తర్వాత డీఎంకే ఆవిర్భవించాయి. అన్నాదురై, కరుణానిధి చలనచిత్ర రంగ దిగ్గజాలు కావొచ్చుగానీ రాజకీయరంగంలో వారి విజయానికి మూలాలు ద్రవిడ ఉద్యమంలో ఉన్నాయి. అలాంటి గడ్డపై తన రాజకీయ రంగ ప్రవేశం గురించిన ప్రకటనలో రజనీకాంత్ భగవద్గీత శ్లోకాన్ని పఠించారు.
నీతి, నిజాయితీలున్న, మతసామరస్యంతో కూడిన ‘ఆధ్యాత్మిక రాజకీయాలను’ ప్రజల వద్దకు తీసుకెళ్తానన్నారు. ఇవి బీజేపీ అనుకూలతను ధ్వని స్తున్నాయని కొందరు భాష్యం చెబుతున్నా... మొత్తం అన్ని సీట్లకూ పోటీ చేస్తా ననడం ద్వారా ఎవరితోనూ పొత్తు ఉండబోదన్న అభిప్రాయం కలిగించేందుకు రజని ప్రయత్నించారు. వాటి సంగతలా ఉంచి మాటల్లోనూ, ఆచరణలోనూ స్పష్టత, నిజాయితీ ఉంటేనే ప్రజలు ఆదరిస్తారు. మరో మూడేళ్ల వ్యవధి ఉంది కదా అని మౌనంగా ఉండక అన్ని అంశాల్లోనూ తానేమిటో, తన వైఖరేమిటో తేటతెల్లం చేసినప్పుడే... వాటికి అనుగుణమైన ఆచరణ ఉన్నప్పుడే రజనీకాంత్ ప్రజలకు చేరువ కాగలరు. రాజకీయాల్లో అస్పష్టతకూ, ఊగిసలాటకూ, లాలూచీలకూ, ప్యాకేజీలకూ తావుండదు. అలా చూస్తే రాగల మూడేళ్లకాలం రజనీకాంత్‌కు పరీక్షా కాలమే. అందులో నెగ్గి రాజకీయరంగంలో సైతం సూపర్‌స్టార్‌నని ఆయన నిరూ పించుకోగలరో లేదో వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment