అణచివేతపై తిరుగుబాటు బావుటా!
అంటరానితనానికి, సామాజిక అణచివేతకు, శ్రమను, ఉత్పాదక వృత్తులను నీచంగా చూసే వర్ణ, కుల వ్యవస్థకు, వాటిపై నిలిచిన విలువలకు వ్యతిరేకంగా మొక్కవోని పోరాటం చేసిన అంబేద్కర్... తర తరాలుగా నోరులేని వాళ్లుగానే ఉన్న వారికి ధిక్కార స్వరాన్నిచ్చారు.
ఆయన పేరు చెబితే చాలు కోట్లాది పీడిత జనం పిడికిలి బిగిస్తుంది, గడ్డిపోచ కూడా ఖడ్గమై లేస్తుంది . అన్యాయం, అసమానత, అణచివేతల మీద తిరుగుబాటు జెండా ఎగురవేస్తుంది. ఆయనే డాక్టర్ బాబా సాహెబ్ భీమ్‌రావు అంబేద్కర్. కోట్లాది దళిత, బహుజనుల కంటి కాంతి, ఆలోచనలోని విద్యుత్తు. అంటరానితనానికి, సామాజిక అణచివేతకు, శ్రమను, ఉత్పాదక వృత్తులను నీచంగా చూసే వర్ణ, కుల వ్యవస్థకు, వాటి విలువలకు వ్యతిరేకంగా మొక్కవోని పోరా టం చేసిన ఆయన... తర తరాలుగా నోరులేని వాళ్లుగానే ఉన్న వారికి ధిక్కార స్వరాన్నిచ్చారు. మహాత్మా జ్యోతిబాఫూలేను స్ఫూర్తిగా తీసుకొని ఆయన గొప్ప సామాజిక విప్లవం సాగించారు. కుల వ్యవస్థ కాల కూట విషమైన అంటరానితనాన్ని ప్రశ్నించిన ఆయన స్వాతంత్య్రోద్యమ నేతలు గాంధీ, నెహ్రూలకు భిన్నమైన బాటను చేపట్టారు. భారతీయ సమాజాన్ని అమానుషం చేస్తున్న కుల వ్యవస్థను రూపమాపవలసిన తక్షణ అవసరాన్ని గుర్తు చేశారు. లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలలో దీన్ని కీలక చర్చనీయాంశం చేశారు. గాంధీజీకి అప్రియమైనప్పటికీ షెడ్యూల్డ్ కులాలకు బ్రిటీష్ ప్రభుత్వం నుంచి కొన్ని రాయితీలను సాధించారు.
అంబేద్కర్ పుట్టింది ‘అంటరాని’ మహర్ కులంలో. అయినా ప్రపంచలోని అత్యంత విద్యావంతులలో, ప్రతి భావంతులలో ఒకనిగా నిలిచారు. అంతర్జాతీయంగా పేరెన్నికగన్న విద్యాసంస్థలలో న్యాయ, తత్వ, ఆర్థిక శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేశారు. అమెరికాలోని కొలం బియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. బహు గ్ర ంథ కర్త అయిన ఆయన రచించిన ‘కుల నిర్మూలన’ అత్యంత శక్తివంతమైన రచన. ఆయన కలాన్ని కత్తిని చేసి అంటరానితనం, కుల వ్యవస్థల మూ లాలను ఛేదించి, వాటిలోని దుర్మార్గాన్ని ఎండగట్టారు. తొలి స్వతంత్ర భారత ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రి పదవిని చేపట్టారు. రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన కమిటీ అధ్యక్షునిగా అనితర ప్రతిభతో ఆ చారిత్రక కర్తవ్యాన్ని నిర్వర్తించారు. అనేక క్లిష్ట సమస్యలకు, మీమాంసలకు విశాల మానవతావాద, సమ్మిళిత, ప్రజాస్వామిక దృష్టితో అంబేద్కర్ సమాధానాలు, వివరణలు సుప్రసిద్ధమైనవి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పరమాశయాలుగా ప్రాథమిక హక్కులతో కూడిన రాజ్యాంగాన్ని నిర్మించారు.
ఆదేశిక సూత్రాలతో ప్రభుత్వాల నైతిక బాధ్యతలను నిర్వచించి, సమున్నత సమాజ నిర్మాణం దిశను నిర్దేశించారు. మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కులలో చేర్చి మన దేశ లౌకితత్వం పునాదులను రాజ్యాంగబద్ధం చేశారు. బలమైన కేంద్రం, స్వతంత్ర రాష్ట్రాలు కలిసిన సమాఖ్య వ్యవస్థను నిర్వచించారు. దళితులు, ఆదివాసీలు ఇతర వెనుకబడిన తరగతులు, మత మైనారిటీలు, మహిళల తరపున దృఢంగా నిలబడ్డారు. వారిపట్ల సానుకూల వివక్షను, ధర్మపక్షపాతాన్ని చూపే అధికరణలను రాజ్యాం గంలో చేర్చేలా చేసిన ఘనత అంబేద్కర్‌దే. ఆర్టికల్ 17, ఆర్టికల్ 30, ఆర్టికల్ 46 ఆయన పీడిత జన పక్షపాతానికి నిదర్శనాలు. స్త్రీలను బానిసత్వం నుంచి విముక్తం చేయకుండా సమసమాజ నిర్మాణం సాధ్యం కాదని ఆయన భావించారు. అంబేద్కర్ రాజ్యాంగంలో చేర్చిన పలు ప్రత్యేక అధికరణల మూలంగానే పార్లమెంటు పలు విప్లవాత్మక, ప్రజాస్వామిక చట్టాలను చేయగలిగింది. న్యాయశాఖ మంత్రిగా ఆయన హిందువులలో బహు భార్యత్వాన్ని నిషేధించి, మహిళలకు ఆస్తి హక్కు, విడాకుల హక్కు తదితర స్వేచ్ఛలను కల్పించడం కోసం హిందూ స్మృతి బిల్లును రూపొందించారు. దానిని అడ్డుకున్నందుకు న్యాయశాఖ మంత్రి పదవి నుంచి వైదొలిగారు.
పునాదులలో సామాజిక ప్రజాస్వామ్యం నెలకొంటే గాని రాజకీయ ప్రజాస్వామ్యం మనుగడ సాగించజాలదు అని అంబేద్కర్ స్పష్టపరిచారు. అందుకే అంబేద్కర్ బౌద్ధమత పునరుద్ధరణకు అవిరళ కృషి చేసినవాడు. ఆయనను ఆదర్శంగా చేసుకునే కాంగ్రెస్ ప్రభుత్వాలు నాటి నుంచి నేటి వరకు సామాజిక న్యాయ సాధనకు అగ్రతర ప్రాధాన్యమిచ్చి కృషి చేస్తున్నాయి. ఆయన మహోన్నత, మానవీయ ఆశయాలను ఆచరణలో పెట్టడానికి నడుం బిగించడమే ఆయనకు మనం ఇవ్వగల సరైన నివాళి.
(
వ్యాసకర్త చైర్మన్, ఏఐసీసీ, షెడ్యూల్డ్ కులాల శాఖ)
రేపు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి
కొప్పుల రాజు